Andhra Pradesh: కొత్త మంత్రులకు శాఖలను కేటాయించిన జగన్.. మంత్రివర్గంలో మార్పులు!
- ధర్మానకు డిప్యూటీ సీఎం, రెవెన్యూ శాఖ
- సీదిరి అప్పలరాజుకు మత్స్య, పశుసంవర్ధక శాఖ
- వేణుగోపాలకృష్ణకు బీసీ సంక్షేమశాఖ
ఏపీ మంత్రిమండలి కొత్త కళను సంతరించుకుంది. నూతన మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసిన సీదిరి అప్పలరాజు, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణకు ముఖ్యమంత్రి జగన్ శాఖలను కేటాయించారు. అప్పలరాజుకు మత్స్య, పశుసంవర్ధక శాఖను అప్పగించారు. ఇంతకాలం శంకర్ నారాయణ వద్ద ఉన్న బీసీ సంక్షేమశాఖను వేణుగోపాలకృష్ణకు కేటాయించారు.
మరోవైపు ధర్మాన కృష్ణదాస్ కు డిప్యూటీ సీఎం పదవితో పాటు రెవెన్యూశాఖను కూడా అప్పగించారు. ఇప్పటి వరకు ధర్మాన వద్ద ఉన్న రోడ్లు, భవనాలశాఖను శంకర్ నారాయణకు కేటాయించారు. ఇంతకాలం రెవెన్యూ మంత్రిగా ఉన్న పిల్లి సుభాష్ చంద్రబోస్, మత్స్య, పశుసంవర్ధక, మార్కెటింగ్ శాఖ మంత్రిగా ఉన్న మోపిదేవి వెంకటరమణ రాజ్యసభకు ఎంపికైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వారు రాష్ట్ర మంత్రి పదవులకు రాజీనామా చేశారు.