Corona Virus: భారత్‌లో 18 కోట్ల మందిలో యాంటీబాడీలు.. 'కరోనా'పై అధ్యయనంలో వెల్లడి
- 18 కోట్ల మందిలో యాంటీబాడీలు
- 60,000 పరీక్షలకు సంబంధించిన వివరాల ఆధారంగా పరిశోధన
- భారత్‌లో 15 శాతం మందిలో ప్రతినిరోధకాలు
- జాబితాలో థానేలోని బివాండీ అగ్రస్థానం
దేశంలో కరోనా ఉద్ధృతి నేపథ్యంలో ఎంతమందికి కరోనా సోకింది? అనే విషయాన్ని నిర్ధారించుకునేందుకు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ఆర్‌టీ- పీసీఆర్ పరీక్షలు, యాంటీబాడీ పరీక్షలకు ఇప్పటికే ఆమోదం తెలిపింది.
ప్రభుత్వ అనుమతి పొందిన ప్రైవేట్ ల్యాబ్ థైరోకేర్ కూడా ఈ పరీక్షలు నిర్వహిస్తోంది. తాజాగా 60,000 పరీక్షలకు సంబంధించిన సమాచారాన్ని విడుదల చేయగా పలు విషయాలు వెల్లడయ్యాయి. కరోనాను దరిచేరనివ్వని యాంటీబాడీలు భారత్‌లోని ఎంతమందిలో ఉన్నాయన్న విషయంపై వివరాలు తెలిశాయి.
దేశంలో 18 కోట్ల మంది భారతీయులు ఇప్పటికే కరోనా రోగనిరోధక శక్తిని కలిగి ఉండవచ్చని తేలింది. అంటే భారత్‌లో సుమారు 15 శాతం మందిలో కరోనా వైరస్‌ను నిరోధించే యాంటీబాడీలు ఉన్నాయని చెప్పింది. భారత్‌లోని దాదాపు 600 ప్రాంతాల్లో 60,000 వేల మందికి దాదాపు మూడు వారాల పాటు థైరోకేర్ సిబ్బంది యాంటీ బాడీ పరీక్షలు నిర్వహించారు.
భారత్‌లో 15 శాతం మందిలో ప్రతినిరోధకాలు అభివృద్ధి చెందినట్లు తెలిపింది. ప్రజల్లో యాంటీబాడీలు అధికంగా ఉన్న ప్రాంతాల జాబితాలో థానేలోని బివాండీ అగ్రస్థానంలో ఉండగా, బెంగళూరులోని పీణ్య రెండో స్థానంలో ఉంది.
శరీరంలో యాంటీబాడీస్ అభివృద్ధి చెందితే కరోనా సోకే అవకాశాలు తక్కువగా ఉంటాయి.
అయితే, కరోనా విజృంభణ నేపథ్యంలో వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తేనే కరోనా పూర్తిగా కట్టడి అవుతుందని పరిశోధకులు చెబుతున్నారు. ప్రపంచంలోని చాలా దేశాలు వ్యాక్సిన్ కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తోన్న విషయం తెలిసిందే.