Pawan Kalyan: వైసీపీ ఆనాడే మూడు రాజధానుల విషయం చెప్పి ఉంటే రైతులు భూములు ఇచ్చేవాళ్లు కాదు: పవన్ కల్యాణ్

Pawan Kalyan responds on decentralisation in AP

  • ఏపీకి మూడు రాజధానులు ఓ కలేనన్న పవన్
  • కాన్సెప్ట్ అమ్ముకుంటున్నారంటూ వ్యాఖ్యలు
  • టీడీపీ-వైసీపీ ఆధిపత్య పోరులో రైతులు నలిగిపోతున్నారు 

ఏపీలో మూడు రాజధానుల అంశం తీవ్ర చర్చనీయాంశంగా కొనసాగుతోంది. దీనిపై జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. ఏపీకి మూడు రాజధానులు ఏర్పాటు చేయడం అనేది ఓ కలేనని పేర్కొన్నారు. అభివృద్ధి అన్ని చోట్లా జరగాల్సిందేనని, కానీ రాజధానులుగా విడగొట్టడం వల్ల అభివృద్ధి జరుగుతుందన్నది ఓ కాన్సెప్ట్ మాత్రమేనని పేర్కొన్నారు. గతంలో టీడీపీ నేతలు సింగపూర్ లాంటి రాజధాని అంటూ కాన్సెప్ట్ ను ఎలా అమ్ముకున్నారో, ఇప్పుడు వైసీపీ నేతలు కూడా అధికార వికేంద్రీకరణ అంటూ మరో కాన్సెప్ట్ ను అమ్మడం తప్ప, ప్రజలకు ఒక కల చూపించడం తప్ప వాస్తవంలో అవేవీ రూపుదాల్చవని స్పష్టం చేశారు.

ఏపీ రాజధానిగా అమరావతిని ప్రతిపాదించినప్పుడు వైసీపీ ప్రతిపక్షంలో ఉందని, తాము మూడు రాజధానులు ఏర్పాటు చేస్తామని వైసీపీ ఆనాడే చెప్పి ఉంటే రైతులు ఇన్నేసి ఎకరాలు ఇచ్చేవారు కాదని పవన్ స్పష్టం చేశారు. రైతులు నాడు భూములు ఇచ్చింది ఏపీ ప్రభుత్వానికి అని పేర్కొన్న పవన్... టీడీపీ-వైసీపీ ఆధిపత్య పోరులో రైతులు నలిగిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా పవన్ నాటి టీడీపీ ప్రభుత్వ నిర్ణయంపైనా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రైతుల నుంచి ఇన్నేసి ఎకరాల భూములు తీసుకుని సింగపూర్ లాంటి రాజధాని కట్టాలంటే మనకు సింగపూర్ తరహా వ్యవస్థ ఉండాలని, లీకాన్ యూ వంటి వ్యక్తి ఉండాలని స్పష్టం చేశారు. అక్కడ అన్ని జాతుల వారు సింగపూర్ వాళ్లే అనే భావన తీసుకువచ్చారని, అంతటి గొప్పమనసు, ఉన్నతమైన రాజకీయ విధానం ఇక్కడ మనకు లేవని తెలిపారు. అంతంత స్థాయిలో భూములు తీసుకుంటే ఎప్పటికైనా ఇబ్బంది అవుతుందని అప్పుడే చెప్పానని, కానీ ఈరోజున నిజంగానే రైతులు నష్టపోతున్నారని వివరించారు.

  • Loading...

More Telugu News