Gadikota Srikanth Reddy: కనగరాజ్ ను నియమించింది కూడా గవర్నరే.. నిమ్మగడ్డ బాధ్యతలు స్వీకరిస్తే ప్రజాస్వామ్యం ఓడిపోయినట్టే: శ్రీకాంత్ రెడ్డి
- మేము గవర్నర్ వ్యవస్థను గౌరవిస్తాం
- సుప్రీంకోర్టు తీర్పు కోసం ఎదురు చూస్తున్నాం
- నిమ్మగడ్డ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడతారని టీడీపీ భావిస్తోంది
ఎస్ఈసీగా నిమ్మగడ్డ రమేశ్ ను కొనసాగించాలంటూ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేయాలంటూ గవర్నర్ బిశ్వభూషన్ హరించందన్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించిన సంగతి తెలిసిందే. రాజ్ భవన్ నుంచి ఆదేశాలు వెలువడిన వెంటనే వైసీపీ నేత గడికోట శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ, ఈ విషయంలో తాము ఓడిపోలేదని... ప్రజాస్వామ్యాన్ని ఓడించారంటూ వ్యాఖ్యానించారు. ఈ కేసు సుప్రీంకోర్టులో ఉందని... సుప్రీం తీర్పు గురించి వేచి చూస్తున్నామని చెప్పారు. ఈ వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి. గవర్నర్ ఆదేశాలను సైతం వైసీపీ ప్రభుత్వం లెక్క చేయడం లేదని విపక్షాలు మండిపడుతున్నాయి.
ఈ నేపథ్యంలో తాజాగా ఓ టీవీ డిబేట్ లో శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ, గవర్నర్ నిర్ణయాన్ని తాము తప్పుపట్టలేదని చెప్పారు. గవర్నర్ వ్యవస్థ, న్యాయ వ్యవస్థపై తమకు గౌరవం ఉందని చెప్పారు. సుప్రీంకోర్టులో ఈ కేసు ఉందని, తీర్పు కోసం తాము ఎదురు చూస్తున్నామని, ఈ విషయాన్ని గవర్నర్ దృష్టికి తీసుకెళ్తామని మాత్రమే చెప్పామని అన్నారు. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలతో ప్రజాస్వామ్యం ఓడిపోయిందని తనలాంటి వారు భావిస్తున్నారనే తాను చెప్పానని తెలిపారు. నిమ్మగడ్డ విధుల్లో చేరితే ప్రజాస్వామ్యం ఓడిపోయినట్టేనని చెప్పారు. ప్రజాస్వామ్యాన్ని నిమ్మగడ్డ గౌరవించాలని అన్నారు.
గవర్నర్ ఆదేశాలను తాము పట్టించుకోవడం లేదనే ఆరోపణల్లో నిజం లేదని... గతంలో ఎస్ఈసీగా కనగరాజ్ ను నియమించింది కూడా గవర్నరే అనే విషయాన్ని గుర్తుంచుకోవాలని శ్రీకాంత్ రెడ్డి చెప్పారు. నిమ్మగడ్డ విధుల్లో చేరితే ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడతారని టీడీపీ భావిస్తోందని ఆరోపించారు. తమకు ప్రజాబలం ఉందని... వచ్చే ఎన్నికల్లో సైతం తాము ఘన విజయం సాధిస్తామని చెప్పారు.