Rajasthan: కాంగ్రెస్ వ్యూహానికి బ్రేక్.. సచిన్ పైలట్ వాదనతో ఏకీభవించిన రాజస్థాన్ హైకోర్టు
- సచిన్ పైలట్ దాఖలు చేసిన పిటిషన్‌కు కోర్టు అనుమతి
- కేంద్రాన్ని భాగస్వామిని చేయాలన్న సచిన్ వాదనతో ఏకీభవించిన న్యాయస్థానం
- ఎమ్మెల్యేల అనర్హత నోటీసులపై నేడు తుది తీర్పు
అనర్హత నోటీసులతో తిరుగుబాటు ఎమ్మెల్యేలను సాగనంపాలనుకున్న కాంగ్రెస్‌కు రాజస్థాన్ హైకోర్టు బ్రేక్ వేసింది. స్పీకర్ జారీ చేసిన అనర్హత నోటీసులపై నేడు విచారణ ప్రారంభించిన న్యాయస్థానం తిరుబాటు నేత సచిన్ పైలట్ దాఖలు చేసిన పిటిషన్‌కు అనుమతి ఇచ్చింది. తాజా సంక్షోభంలో కేంద్ర ప్రభుత్వాన్ని కూడా భాగస్వామిని చేయాలన్న ఆయన వాదనతో కోర్టు ఏకీభవించింది. కేంద్రం స్పందన కోసం విచారణను 15 నిమిషాల పాటు వాయిదా వేసింది.
కాగా, కేంద్రం తరపున అదనపు సొలిసిటర్ జనరల్ వాదనలు వినిపించనున్నారు. మరోవైపు, ఎమ్మెల్యేల అనర్హత నోటీసులపై నేడు తుది తీర్పు వెల్లడి కానుండడంతో సర్వత్ర ఆసక్తి నెలకొంది. తీర్పు కనుక పైలట్ వర్గానికి అనుకూలంగా వస్తే మాత్రం గెహ్లాట్ సర్కారుకు ఇబ్బందులు తప్పవనే చెప్పొచ్చు!