Corona Virus: క్వారంటైన్ కేంద్రంలో పిల్లనగ్రోవి వాయించిన కరోనా రోగి.. తన్మయత్వంతో నృత్యం చేసిన ఇతర రోగులు
- అసోంలో ఘటన
- బాధితుల్లో ఆత్మ విశ్వాసం నింపుతోన్న వైద్యులు
- క్వారంటైన్ కేంద్రాల్లో సందడిగా గడుపుతోన్న రోగులు
మురళీగానం చేస్తూ శ్రీకృష్ణుడు బృందావనంలో తిరుగుతుంటే గోమాతలు సైతం నాట్యమాడేవట. మధురమైన పిల్లనగ్రోవికి అంత శక్తి ఉంటుందని కొందరు నమ్ముతారు. చక్కని వేణుగానం వింటే ఎలాంటి మానసిక సమస్యలైనా మాయమవుతాయని భావిస్తారు.
కరోనా వ్యాధి సోకి కుటుంబానికి దూరంగా క్వారంటైన్ కేంద్రంలోనే గడుపుతోన్న రోగులు సైతం అటువంటి మురళీగానం విని తమ సమస్యలను మర్చిపోయి, తన్మయత్వంతో నృత్యం చేశారు.
అసోంలో ఓ రోగి పిల్లనగ్రోవి వాయించగా మిగతా రోగులు డ్యాన్స్ చేసిన వీడియో బయటకు వచ్చింది. ఇలాంటి కార్యక్రమాలు బాధితుల్లో ఆత్మ విశ్వాసం నింపుతాయని వైద్య సిబ్బంది అంటున్నారు. అక్కడే కాదు దేశ వ్యాప్తంగా క్వారంటైన్ కేంద్రాల్లో రోగులు సందడిగా గడిపేలా వైద్యులు చర్యలు తీసుకుంటున్నారు.
జైలులో ఏకాంతంగా ఉన్నట్లు వారిలో ఫీలింగ్ కలగకుండా కరోనా రోగులతో క్యారం బోర్డు, చెస్ వంటి ఆటలను సైతం ఆడిస్తున్నారు. క్వారంటైన్ కేంద్రాల్లో రోగులంతా కలిసి ఓ పాటకు గ్రూప్ డ్యాన్స్ చేసిన వీడియో కూడా ఇటీవల వైరల్ అయింది.