Ayodhya Ram Mandir: అయోధ్య రామమందిరం భూమిపూజను వ్యతిరేకిస్తూ పిటిషన్.. కొట్టేసిన అలహాబాద్ హైకోర్టు
- వచ్చే నెల 5వ తేదీన రామమందిరం నిర్మాణానికి భూమిపూజ
- మోదీ చేతుల మీదుగా కార్యక్రమం
- కార్యక్రమాన్ని ఆపేయాలని పిల్ వేసిన సామాజిక కార్యకర్త
ఆగస్ట్ 5వ తేదీన అయోధ్య రామాలయం నిర్మాణానికి భూమి పూజ జరగనుంది. మరోవైపు, కార్యక్రమాన్ని వ్యతిరేకిస్తూ ఉత్తరప్రదేశ్ లోని అలహాబాద్ హైకోర్టులో పిల్ దాఖలైంది. ప్రస్తుతం కరోనా వైరస్ ప్రభావం తీవ్రంగా ఉందని... ఆలయం భూమిపూజ కార్యక్రమానికి దాదాపు 200 మంది హాజరయ్యే అవకాశం ఉందని... దీంతో, కరోనా వ్యాప్తి చెందే అవకాశం ఉందని ఒక సామాజిక కార్యకర్త పిటిషన్ వేశారు. 5వ తేదీన నిర్వహించతలపెట్టిన భూమిపూజ జరగకుండా ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్ లో కోరారు.
ఈ పిటిషన్ ను ఈరోజు విచారించిన హైకోర్టు... పిటిషన్ ను కొట్టేసింది. మరోవైపు ప్రధాని మోదీ చేతుల మీదుగా భూమిపూజ కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమానికి అద్వానీ, మురళీ మనోహర్ జోషి, మోహన్ భగవత్ తదితర వీవీఐపీలు 50 మంది హాజరుకానున్నారు.