Tony Blair: కరోనాను అంతం చేయలేము.. దాంతో కలిసి జీవించడం నేర్చుకోవాలి: బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్
- వైరస్ మరోసారి విజృంభిస్తే.. కంటైన్మెంట్ నిబంధనలను కఠినంగా అమలు చేయాలి
- ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలన్న టోనీ బ్లెయిర్
- వచ్చే ఏడాది మధ్య వరకు కరోనా ప్రభావం ఉంటుందన్న బోరిస్ జాన్సన్
కరోనా మహమ్మారిని మనం పూర్తిగా అంతం చేయలేమని బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్ అన్నారు. శరదృతువు కాలంలో వైరస్ మరోసారి విజృంభిస్తే.. బ్రిటన్ లో కంటైన్మెంట్ నిబంధనలను మరింత కఠినంగా అమలు చేయాల్సిన అవసరం ఉంటుందని చెప్పారు. లాక్ డౌన్ నిబంధనలను సడలించినా... రానున్న రోజుల్లో కూడా ప్రతి ఒక్కరూ మాస్కులను తప్పనిసరిగా ధరించాలని సూచించారు. కరోనాతో కలిసి జీవించడాన్ని మనమంతా నేర్చుకోవాలని చెప్పారు.
బ్రిటన్ ప్రస్తుత ప్రధాని బోరిస్ జాన్సన్ మాట్లాడుతూ, ప్రస్తుత పరిస్థితి కొంచెం మెరుగ్గా ఉన్నప్పటికీ... కరోనా ప్రభావం వచ్చే ఏడాది మధ్య వరకు ఉంటుందని చెప్పారు. రాబోయే కాలంలో మరింత క్లిష్ట పరిస్థితిని ఎదుర్కోవాల్సిన పరిస్థితులు దాపురించే అవకాశాలు ఉన్నాయనేది తన అభిప్రాయమని అన్నారు. గతంలో మనకు తెలియని జీవితో ప్రస్తుతం మనం యుద్ధం చేస్తున్నామని చెప్పారు.