Chandrababu: రాజ్యాంగాన్ని ధిక్కరించేందుకు అనుమతి కోసం వెళితే ఇలాగే ఉంటుంది: చంద్రబాబు
- ఎస్ఈసీగా నిమ్మగడ్డను కొనసాగించాలన్న హైకోర్టు
- హైకోర్టు నిర్ణయంపై స్టే ఇవ్వాలని సుప్రీంను కోరిన ఏపీ సర్కారు
- స్టే ఇచ్చేందుకు తిరస్కరించిన సుప్రీంకోర్టు
- ఎదురుదెబ్బలు తప్పవన్న చంద్రబాబు
నిమ్మగడ్డ రమేశ్ కుమార్ పునర్నియామకం విషయంలో కోర్టు ధిక్కరణ ప్రొసీడింగ్స్ పై స్టే ఇవ్వాలని సుప్రీంకోర్టును కోరిన వైసీపీ సర్కారుకు నిరాశ తప్పలేదు. స్టే ఇచ్చేందుకు సుప్రీం నిరాకరించడం తెలిసిందే. దీనిపై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు.
ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పై కోర్టులకు వెళ్లాలి గానీ, రాజ్యాంగాన్ని ధిక్కరిస్తాం అనుమతి ఇవ్వండి అంటూ వెళితే ఇలాగే ఎదురుదెబ్బలు తగులుతాయని జగన్ సర్కారును ఉద్దేశించి హితవు పలికారు. ఇప్పటికైనా నా ఇష్టం-నా పాలన అనే పెడధోరణి పక్కనబెట్టి వ్యవస్థలను కాపాడాలని, వ్యక్తుల కన్నా వ్యవస్థలే శాశ్వతమని పేర్కొన్నారు. ఎస్ఈసీగా నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ను కొనసాగించాలన్న హైకోర్టు తీర్పుపై స్టే ఇవ్వడానికి నిరాకరిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను స్వాగతిస్తున్నామని తెలిపారు.