Vijayawada: పనిచేస్తున్న దుకాణంలో 7 కిలోల బంగారు ఆభరణాలు చోరీ.. ఆపై కట్టుకథ.. గంటల వ్యవధిలోనే ఛేదించిన పోలీసులు

Huge gold robbery in vijayawada

  • విజయవాడలో సంచలనం సృష్టించిన ఘటన
  • షాపులో పెద్ద ఎత్తున ఉన్న బంగారం నగలు, డబ్బు చూసి ఆగలేకపోయిన నిందితుడు
  • ఒంటిపై గాయాలు చేసుకుని కాళ్లు కట్టేసుకుని నాటకం

తాను పనిచేస్తున్న దుకాణంలో భారీ చోరీకి పాల్పడిన ఓ యువకుడు తెలివిగా అల్లిన కట్టుకథ పోలీసులను నమ్మించలేకపోవడంతో దొరికిపోయి కటకటాలపాలయ్యాడు. విజయవాడలో జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. పోలీసుల కథనం ప్రకారం.. నగరంలోని కాటూరువారి వీధిలో రాజుసింగ్‌చరణ్ రెండేళ్లుగా బంగారు నగల దుకాణాన్ని నిర్వహిస్తున్నాడు. కరోనా కారణంగా గిరాకీ పెద్దగా లేకపోవడంతో 19 కిలోల వెండి, రూ. 20 లక్షల నగదు దుకాణంలోనే ఉంచాడు.

తన స్నేహితుడైన మరో వ్యాపారి మనోహర్‌సింగ్ రాథోడ్‌కు చెందిన 7 కిలోల బంగారం, రూ. 22 లక్షల నగదును కూడా తన దుకాణంలోనే దాచిపెట్టాడు. దుకాణంలో పెద్ద ఎత్తున నగదు, నగలు ఉండడంతో గురువారం రాత్రి యజమాని రాజుసింగ్‌ అక్కడే నిద్రపోయాడు. నిన్న ఉదయమే నిద్రలేచి, తన వద్ద పనిచేసే విక్రం కుమార్ లోహార్ ను షాపు వద్ద పెట్టి, తను ఇంటికి వెళ్లాడు.

కాసేపటికి మనోహర్ సింగ్ తాను రాజు సింగ్ వద్ద దాచిన బంగారం, నగదు తీసుకురమ్మని తన గుమాస్తా గోపాల్ సింగ్ ని దుకాణానికి పంపాడు. అతను వచ్చి అక్కడి పరిస్థితి చూసి షాకయ్యాడు. అక్కడ పనిచేసే విక్రంకుమార్ ఒళ్లంతా గాయాలతో పడి ఉన్నాడు. అతడి కాళ్లు చేతులు కట్టేసి ఉన్నాయి. షాక్ నుంచి తేరుకున్న గోపాల్ సింగ్ విషయాన్ని రాజుసింగ్ కి చేరవేశాడు. ఆయన పరుగు పరుగున దుకాణానికి చేరుకున్నాడు. ఆ వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గాయాలపాలైన విక్రం కుమార్‌ను ఆసుపత్రికి తరలించి షాపు నుంచి వేలిముద్రలు సేకరించి దర్యాప్తు ప్రారంభించారు. ఈ సందర్భంగా విక్రం కుమారే నిందితుడని గుర్తించారు.

రాజస్థాన్‌కు చెందిన నిందితుడు విక్రం కుమార్‌ను రాజుసింగ్ (23) 40 రోజుల క్రితమే పనిలో పెట్టుకున్నాడు. దుకాణంలో పెద్ద ఎత్తున నగలు, డబ్బులు చూసే సరికి ఆగలేకపోయాడు. ఎలాగైనా వాటిని కొట్టేయాలని పథకం పన్నాడు. బంగారు, వెండి, నగదును దొంగిలించి దుకాణం కింద మరమ్మతులు జరుగుతున్న ఇంట్లో దాచిపెట్టాడు.

సీసీ కెమెరాలోని డీవీఆర్‌ను తీసేసి పక్కనే ఉన్న కాలువలోకి విసిరేశాడు. అనంతరం దుకాణంలోని టీవీ, కంప్యూటర్లను ధ్వంసం చేశాడు. శరీరంపై బ్లేడుతో గాయాలు చేసుకుని కాళ్లు, చేతులను టేపుతో కట్టేసుకున్నాడు. దుండగులు వచ్చి తనపై దాడిచేసి గాయపరిచి కట్టేసి దొంగతనం చేసినట్టు నమ్మించాలనుకున్నాడు.

అయితే, సమీప షాపుల్లోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించిన పోలీసులు దుకాణంలోకి కొత్త వ్యక్తులు వచ్చినట్టు కనిపించకపోవడం, షాపులో విక్రం కుమార్‌వి తప్ప మరొకరి వేలి ముద్రలు లేకపోవడంతోపాటు సంచితో ఒకసారి అతడు బయటకు వెళ్లినట్టు గుర్తించారు. దీంతో అతడే ఈ చోరీకి పాల్పడి ఉంటాడని భావించిన పోలీసులు తమదైన శైలిలో విచారించగా నేరం అంగీకరించాడు. విక్రం కుమార్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు.

  • Loading...

More Telugu News