Krishna District: కాలకృత్యాలు తీర్చుకునేందుకు వాహనం దిగితే.. కారొచ్చి ఢీకొట్టి, ముగ్గుర్ని కబళించింది!
- డివైడర్‌ను ఢీకొని రోడ్డు పక్కన నిల్చున్న వారిపైకి దూసుకెళ్లిన కారు
- ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురి మృతి
- ప్రమాదానికి కారణమైన కారులోని ముగ్గురికీ చిన్న గాయం కూడా కాని వైనం
మృత్యువు ఏ వైపు నుంచి ఎలా? ఎప్పుడు? వస్తుందన్న విషయాన్ని చెప్పలేమనడానికి ఇదో ఉదాహరణ. ఈ విషాద ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. హైదరాబాద్-విజయవాడ రహదారిపై సూర్యాపేట వద్ద జరిగిందీ ఘటన. పోలీసుల కథనం ప్రకారం.. కృష్ణా జిల్లా కృత్తివెన్ను మండలంలోని ఇంటేరు గ్రామానికి చెందిన నాగమల్లేశ్వరరావు (46), భార్య మావులమ్మ (35), కుమార్తె దుర్గ (16), కుమారుడు కొండబాబులతో కలిసి హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో ఉంటూ నిర్మాణ పనులు చేస్తూ జీవిస్తున్నారు. ఇటీవల వీరు స్వగ్రామం వెళ్లగా, నిన్న తిరిగి హైదరాబాద్ బయలుదేరారు.
బంధువుల కారులో వస్తున్న వీరు సూర్యాపేట జిల్లా మునగాల మండలం మొద్దులచెరువు సమీపంలో కారు ఆపి కాలకృత్యాల కోసం కిందికి దిగారు. డ్రైవర్ బొడ్డు వెంకట రంగారావు మాత్రం కారులోనే ఉన్నాడు.
అదే సమయంలో హైదరాబాద్‌కు చెందిన రావుల శశిధర్ తన భార్య కుమారుడు అనురాగ్‌తో కలిసి కారులో ఏలూరు నుంచి నగరానికి వస్తున్నారు. ఈ క్రమంలో వీరి కారు మొద్దులచెరువు సమీపంలో అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టి రోడ్డు పక్కన నిల్చున్న నాగమల్లేశ్వరరావు కుటుంబ సభ్యులపైకి దూసుకెళ్లి వారి కారును బలంగా ఢీకొట్టింది.
కారు ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడిన నాగమల్లేశ్వరరావుతోపాటు ఆయన భార్య, కుమార్తె అక్కడికక్కడే మృతి చెందారు. కుమారుడు కొండబాబు తీవ్రంగా గాయపడగా, డ్రైవర్ వెంకటరంగారావు ప్రమాదం నుంచి బయటపడ్డాడు. అయితే, ప్రమాదానికి కారణమైన కారులో ఉన్న ముగ్గురికీ ఎలాంటి గాయాలు కాకపోవడం గమనార్హం. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను, క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.