Chandrababu: నలంద కిశోర్ మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన చంద్రబాబు
- గుండెపోటుతో మరణించిన నలంద కిశోర్
- కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపిన చంద్రబాబు
- నలంద కిశోర్ మృతికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్
మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు అనుచరుడు నలంద కిశోర్ గుండెపోటుతో మరణించడం పట్ల టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. వైసీపీ తప్పుడు కేసుల వేధింపులు తట్టుకోలేక నలంద కిశోర్ కలత చెందారని చంద్రబాబు పేర్కొన్నారు. సోషల్ మీడియాలో పోస్ట్ షేర్ చేశాడనే వంకతో అక్రమ కేసులు బనాయించారని ఆరోపించారు.
వృద్ధుడని కూడా చూడకుండా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పారని విమర్శించారు. ఆయన వయసును కూడా పట్టించుకోకుండా విశాఖ నుంచి కర్నూలు తీసుకుపోయారని ఆరోపించారు. అంత అవసరం ఏమొచ్చింది? ఆయనేమైనా తీవ్రవాదా? అంటూ మండిపడ్డారు. ఇది కచ్చితంగా ప్రభుత్వం చేసిన హత్య... నలంద కిశోర్ మృతికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని స్పష్టం చేశారు.
65 ఏళ్ల నలంద కిశోర్ కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతుండగా, గుండెపోటు రావడంతో ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మరణించారు. ఏపీ మంత్రి అవంతి శ్రీనివాస్, ఎంపీ విజయసాయిరెడ్డిలపై సోషల్ మీడియాలో వచ్చిన అభ్యంతరకర పోస్టులను షేర్ చేశాడంటూ నలంద కిశోర్ ను అరెస్ట్ చేశారు.