Poseidon: అమెరికా నుంచి మరో 6 పోసిడాన్ విమానాలను కొనేందుకు భారత్ తహతహ

India to purchase six Poseidon planes from US

  • సముద్రతల నిఘా కోసం పోసిడాన్ లను వినియోగిస్తున్న భారత్
  • చైనాతో సరిహద్దుల వద్ద పెరిగిన ఉద్రిక్తతలు
  • పోసిడాన్ లను సరిహద్దులకు తరలించిన భారత్

చైనాతో సరిహద్దు వివాదాల నేపథ్యంలో భారత్ ఆయుధ సమీకరణ వేగం పుంజుకుంది. ఫ్రాన్స్ నుంచి రాఫెల్ విమానాలను ఆగమేఘాలపై రప్పిస్తున్న కేంద్రం తాజాగా, అమెరికా నుంచి మరో 6 పోసిడాన్ పీ-81 నిఘా విమానాలను కొనుగోలు చేసేందుకు సిద్ధమైంది. సముద్రతల నిఘా సేవల కోసం భారత్ పోసిడాన్ విమానాలపైనే ఆధారపడుతోంది. తాజాగా చైనాతో ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ లాంగ్ రేంజ్ నిఘా విమానాలను సరిహద్దులకు తరలించారు. అయితే భవిష్యత్ అవసరాల దృష్ట్యా అమెరికా నుంచి మరికొన్ని పోసిడాన్ విమానాలు కొనుగోలు చేయాలని తీర్మానించారు.

ఇవి నిఘా విమానాలు మాత్రమే కాదు, అవసరమైతే శత్రువుపై దాడులు కూడా చేస్తాయి. బోయింగ్ తయారీ పీ-81 విమానాల్లో అత్యాధునిక రాడార్లు, ఎలక్ట్రో ఆప్టిక్ సెన్సర్లతో పాటు హార్పూన్ బ్లాక్-2 క్షిపణులు, ఎంకే-54 టార్పెడోలు అమర్చి ఉంటాయి. తాజా కొనుగోలుపై రక్షణ వర్గాలు స్పందిస్తూ, భారత ప్రభుత్వం నుంచి అమెరికా ప్రభుత్వానికి దీనికి సంబంధించిన ప్రతిపాదన పత్రాలు వెళ్లాయని తెలిపాయి. వచ్చే ఏడాది ఆరంభం నాటికి ఈ కొనుగోలు కార్యరూపం దాల్చుతుందని వివరించాయి.

  • Loading...

More Telugu News