Telangana: 5 కోట్ల డోలో సహా... 54 రకాల ఔషధాలను ప్రభుత్వ ఆసుపత్రులకు చేర్చిన తెలంగాణ ప్రభుత్వం!

Telangana Govt Supplies Medicines toHospitals

  • అన్ని ఆసుపత్రులకూ చేరిన ఔషధాలు
  • నెలకు లక్ష మందికి సరిపడా మందులు
  • అత్యవసర మందులకు మాత్రం కొరత
  • ఆర్డరిచ్చి తెప్పిస్తున్నామన్న అధికారులు

కరోనా నివారణకు నడుం బిగించిన తెలంగాణ వైద్యఆరోగ్య శాఖ, పీహెచ్సీలు, సీహెచ్సీలతో పాటు ఏరియా ఆసుపత్రులు, జిల్లా ఆసుపత్రులకు భారీ ఎత్తున ఔషధాలను సరఫరా చేసింది. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో, సాధారణ సీజనల్ వ్యాధులు కూడా పెరుగుతూ ఉండటంతో అప్రమత్తమైన అధికారులు, 5 కోట్ల పారాటిటమాల్ టాబ్లెట్లు (డోలో)లను అన్ని ఆసుపత్రులకు చేర్చింది. దీంతో పాటు మరో 54 రకాల ఔషధాలను కూడా అధికారులు అందుబాటులోకి తెచ్చారు. వీటిల్లో యాంటీ బయాటిక్స్ అయిన అజిత్రో మైసిన్ తో పాటు, సీ, డీ విటమిన్ టాబ్లెట్లు, మల్టీ విటమిన్ టాబ్లెట్లు, జలుబు, దగ్గు, బీపీ, మధుమేహం, ఇతర శ్వాసకోశ సంబంధ ఔషధాలను, ఎమర్జెన్సీ మెడిసిన్స్ ను సరఫరా చేసింది.

కాగా, కరోనా తీవ్రంగా ఉన్న వారికి అవసరమయ్యే రెమిడిసివిర్, ఫాబి ఫ్లూ వంటి మందులకు దేశవ్యాప్తంగా డిమాండ్ ఉన్నందున, కొంత కొరత ఉందని, అందువల్ల అవసరమైనంత మేరకు జిల్లాలకు ఇంకా సరఫరా చేయలేకపోయామని ఉన్నతాధికారులు వెల్లడించారు. అతి త్వరలోనే మరిన్ని ఆర్డర్లు తెప్పించేందుకు ఏర్పాట్లు చేసినట్టు వెల్లడించారు. ఈ ఔషధాలు వాడితే, కరోనా సోకిన వారు త్వరగా కోలుకుంటుండటంతో వీటిని పెద్దఎత్తున తెప్పించాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ నిర్ణయించుకుంది.

ఇక వచ్చే నాలుగైదు వారాల్లో కేసుల సంఖ్య మరింతగా పెరిగే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు స్పష్టం చేసిన నేపథ్యంలో వీటితో పాటు కీలకమైన తొసిలిజుమాబ్ ఇంజక్షన్ ను కూడా తెప్పించాలని అధికారులు నిర్ణయించారు. అయితే, దీని ధర రూ. 30 వేలుగా ఉండటంతో, మరింత బడ్జెట్ కేటాయింపులు అవసరమని, ఇదే సమయంలో జిల్లాలకు ఆక్సిజన్ సిలిండర్ల అవసరం కూడా ఉందని అధికారులు వ్యాఖ్యానించారు.

ఇక జ్వరం వచ్చినా, వెంటనే యాంటీ బయాటిక్స్ సహా, కరోనా కోర్సును ప్రారంభించాలని అధికారుల నుంచి వైద్యులకు ఆదేశాలు అందాయి. 100 డిగ్రీలకు పైగా జ్వరం వస్తే, అది వైరస్ ఇన్ ఫెక్షన్ గా రూపాంతరం చెందకముందే యాంటిబయోటిక్స్ , మల్టీ విటమిన్, సీ విటమిన్ మాత్రలు ఇవ్వాలని, వాటిని ఐదు రోజుల కోర్సుగా అందించాలని, పరిస్థితిని బట్టి కోర్సు పరిధిని పెంచాలని అధికారులు సూచించారు. నెలకు కనీసం లక్ష మందికి సరిపడేలా, ఐదు నెలలకు అవసరమైన అన్ని రకాల ఔషధాలనూ సిద్ధం చేశామని తెలంగాణ రాష్ట్ర వైద్య సేవల మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ వెల్లడించింది.

  • Loading...

More Telugu News