Indian Railways: కరోనా బారినపడిన 2,700 మంది రైల్వే ఉద్యోగులు.. వెల్లడించిన మంత్రి పీయూష్ గోయల్
- కరోనా కష్టకాలంలో రైల్వే విశేష సేవలు
- ఈ సందర్భంగా ఉద్యోగులకు కరోనా
- కేంద్రం కృషి వల్లే దేశంలో మిగులు విద్యుత్
కరోనా కల్లోల సమయంలో అత్యవసర సేవలు అందిస్తున్న భారతీయ రైల్వేలోని 2,700 మంది ఉద్యోగులు కరోనా బారినపడ్డారు. ఈ మేరకు కేంద్ర రైల్వే, వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. ఔషధాలు, ఇతర అత్యవసర వస్తువులను దేశంలోని వివిధ ప్రాంతాలకు సరఫరా చేస్తూ ఈ కరోనా కష్టకాలంలో రైల్వే కీలక పాత్ర పోషించిందని అన్నారు. అలాగే, లాక్డౌన్ కారణంగా దేశంలోని వివిధ ప్రాంతాలలో చిక్కుకుపోయిన వలస కూలీల కోసం ప్రత్యేకంగా శ్రామిక్ రైళ్లను నడిపి గమ్యస్థానాలకు చేర్చింది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా 2,700 మంది ఉద్యోగులకు కరోనా సంక్రమించిందని మంత్రి తెలిపారు.
కాగా, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న చార్టర్డ్ అకౌంటెంట్లు, కంపెనీ కార్యదర్శులతో నిన్న బీజేపీ తెలంగాణ శాఖ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించింది. మంత్రి పీయూష్ గోయల్ ఢిల్లీ నుంచి పాల్గొనగా, పార్టీ తెలంగాణ చీఫ్ బండి సంజయ్ హైదరాబాద్ నుంచి పాల్గొన్నారు. ఈ సందర్భంగా గోయల్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ కృషి వల్లే దేశంలో మిగులు విద్యుత్ ఉందని పేర్కొన్నారు.