Narendra Modi: ఆగస్టు 15న దేశ ప్రజలంతా ఈ ప్రతిజ్ఞ చేయాలి: ప్రధాని మోదీ పిలుపు
- కొన్ని రోజుల్లో రక్షాబంధన్ రానుంది
- స్థానిక ఉత్పత్తులను రాఖీ పండుగ ద్వారా ప్రోత్సహించాలి
- దేశీయ, ప్రాంతీయ ఉత్పత్తుల వాడకం పెరగాలి
- ఆగస్టు 15 కూడా భిన్నమైన పరిస్థితులలో జరుపుకుంటున్నాం
- కరోనా నుంచి స్వాతంత్ర్యం పొందుతామని ప్రతిజ్ఞ చేయాలి
ఈ సారి రాఖీ పండుగను వైవిధ్యంగా జరుపుకోవాలని ప్రధాని మోదీ సూచించారు. దేశప్రజలను ఉద్దేశించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్‌కీ బాత్‌లో ప్రసంగిస్తున్నారు. ఈ సందర్భంగా త్వరలో జరగనున్న రాఖీ పండుగ, స్వాతంత్ర్య దినోత్సవాల గురించి ప్రస్తావించారు.
'కొన్ని రోజుల్లో రక్షాబంధన్ రానుంది. ఈ సారి ఈ పండుగను వైవిధ్యంగా జరుపుకోవాలి. స్థానిక ఉత్పత్తులను రాఖీ పండుగ ద్వారా ప్రోత్సహించాలి. దేశీయ, ప్రాంతీయ ఉత్పత్తుల వాడకం పెరగాలి. ఈ సారి ఆగస్టు 15 కూడా భిన్నమైన పరిస్థితులలో జరుపుకుంటున్నాం. కరోనా మహమ్మారి విజృంభిస్తోన్న సమయంలో స్వాతంత్ర్య దినోత్సవం జరుగుతుంది. ఈ మహమ్మారి నుండి స్వాతంత్ర్యం పొందుతామని స్వాతంత్ర్య దినోత్సవం రోజున ప్రతిజ్ఞ చేయాలని నేను యువతను, దేశ ప్రజలను కోరుతున్నాను' అని చెప్పారు.
'ఆగస్టు 7 జాతీయ చేనేత దినోత్సవం. భారత హస్తకళ వందల సంవత్సరాల అద్భుతమైన చరిత్ర కలిగి ఉంది. చేనేతను, హస్తకళను భారతీయులు వీలైనంత ఎక్కువగా వాడాలి. దీని గురించి ప్రచారం చేయాలి. వెదురు నుంచి త్రిపుర, మణిపూర్, అసోం హస్త కళాకారులు చాలా నాణ్యత గల నీటి సీసాలు, టిఫిన్ డబ్బాలను తయారు చేయడం ప్రారంభించారు. మీరు వాటి నాణ్యతను చూస్తే ఆశ్చర్యపోతారు' అని మోదీ చెప్పారు.
'వెదురుతో అంత చక్కటి సీసాలు తయారయ్యాయంటే మీరు నమ్మరు. బీహార్‌లో ఎస్‌జీహెచ్‌లు మధుబానీ పెయింటింగ్‌తో మాస్కులు తయారు చేయడం ప్రారంభించాయి. అవి బాగా ప్రాచుర్యం పొందాయి. కరోనా సమంయలో గ్రామీణ ప్రాంతాలు దేశానికి దిశానిర్దేశం చేశాయి. కొన్నిసార్లు ముఖం నుండి మాస్కు తొలగించాలని అనిపిస్తుంది. మాస్క్ కారణంగా మీకు ఇబ్బంది వచ్చినప్పుడల్లా, ఒక్క క్షణం వైద్యులను నర్సులను గుర్తు తెచ్చుకోండి. గంటల తరబడి నిరంతరం మాస్క్ ధరించి వాళ్లు ఇబ్బంది పడడం లేదా? వారిని గుర్తు తెచ్చుకోండి' అని మోదీ వ్యాఖ్యానించారు.