China: దౌత్యకార్యాలయం ఖాళీ చేయాలంటూ అమెరికా ఆదేశాలు.. కీలక పత్రాలు దహనం చేసిన చైనా అధికారులు!
- హూస్టన్ లో చైనా రాయబార కార్యాలయం మూసివేత
- హూస్టన్ నుంచి వెళ్లిపోవాలన్న అమెరికా
- చైనా రాయబార కార్యాలయంలో పొగలు
- అగ్నిమాపక సిబ్బందిని అనుమతించని చైనా
హ్యూస్టన్ నగరంలో ఉన్న చైనా దౌత్య కార్యాలయాన్ని మూసివేయాలంటూ అమెరికా ఆదేశాలు జారీ చేసిన తర్వాత ఆసక్తికర పరిణామాలు జరిగాయి. రాయబార కార్యాలయం ముసుగులో గూఢచర్యానికి పాల్పడుతున్నారని ఆరోపించిన అమెరికా, కార్యాలయాన్ని ఖాళీ చేయాలంటూ స్పష్టం చేసింది. ఈ ఆదేశాలు వెలువడిన కాసేపటికే హూస్టన్ లోని చైనా రాయబార కార్యాలయంలో భారీగా పొగలు వెలువడ్డాయి. అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బందిని చైనా దౌత్యాధికారులు లోపలికి అనుమతించలేదు.
దాంతో డ్రోన్ లు, నిచ్చెనల సాయంతో అగ్నిమాపక అధికారులు లోపల జరుగుతున్న తతంగాన్ని గమనించారు. పెద్ద ఎత్తున కీలక పత్రాలను దహనం చేస్తున్నట్టు గుర్తించారు. అందుకే అంతగా పొగలు వచ్చినట్టు తెలుసుకున్నారు. అంతేకాదు, చైనా దౌత్యాధికారులు పెద్ద ఎత్తున వాహనాల్లో సామగ్రిని తరలించారు. చైనా గూఢచర్యం ద్వారా రాబట్టిన సాంకేతిక పరిజ్ఞానం, సైంటిఫిక్ డేటాను ఇప్పటివరకు ఈ దేశం సరిహద్దులు దాటిస్తున్నట్టు భావిస్తున్నారు.