Corona Virus: మాయలాడి కరోనా.. రోగ నిరోధక వ్యవస్థను ఏమార్చి బోల్తా కొట్టిస్తున్న వైరస్!
- రోగ నిరోధక శక్తిని మాయ చేస్తున్న వైరస్ జన్యుక్రమం
- ఎన్ఎస్‌పీ-10 అనే ఎంజైమును విడుదల చేస్తూ బోల్తా కొట్టిస్తున్న వైనం
- ఎన్ఎస్‌పీ-16తో కలిసి పనిచేస్తున్న ఎన్ఎస్‌పీ-10
ఔషధాలకు చిక్కకుండా ప్రపంచాన్ని అల్లకల్లోలపరుస్తున్న కరోనా వైరస్‌కు సంబంధించిన మరో కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. మనుషుల్లోని రోగ నిరోధకశక్తిని ఏమార్చి.. దాని జన్యుక్రమం కూడా మన శరీరంలోని అంతర్భాగమేనని భ్రమింపజేసేలా ప్రయత్నిస్తున్న ఓ ఎంజైమ్‌ను అమెరికా శాస్త్రవేత్తలు గుర్తించారు. మానవ రోగ నిరోధక వ్యవస్థను ఏమార్చే ఆ ఎంజైము ఎన్ఎస్‌పీ-10 అనే ప్రొటీన్ అని ఈ అధ్యయనానికి నేతృత్వం వహించిన భారత సంతతికి చెందిన శాస్త్రవేత్త యోగేశ్ గుప్తా తెలిపారు.
ప్రొటీన్ల ఉత్పత్తి కేంద్రాలకు జన్యుకోడ్‌లను పంపే వ్యవస్థ.. వైరల్ ఎంఆర్ఎన్ఏలను మార్చి అది మానవ ఎంఆర్ఎన్ఏలా కనిపించేలా చేస్తోందని, ఫలితంగా రోగ నిరోధక వ్యవస్థ ప్రతిస్పందన నుంచి వైరస్‌ను రక్షిస్తుందని గుర్తించారు. ఎన్ఎస్‌పీ-10 ప్రయోగించే ఈ ట్రిక్ వల్ల మానవ కణజాలం బోల్తా పడుతున్నట్టు శాస్త్రవేత్తలు తెలిపారు.
ఎన్ఎస్‌పీ-16 అనే మరో ఎంజైముతో కలిసి ఈ ఎన్‌ఎస్‌పీ-10 పనిచేస్తుందని యోగేశ్ గుప్తా తెలిపారు. ఎన్ఎస్‌పీ-16కు సంబంధించిన త్రీడీ నిర్మాణాన్ని ఆవిష్కరించిన శాస్త్రవేత్తలు.. వైరల్ ఎంఆర్ఎన్ఏలో మార్పులు చేయకుండానే దీనిని నిలువరించేందుకు కొత్త ఔషధాల రూపకల్పనకు వీలు కలుగుతుందని చెప్పారు.