God Brik: అయోధ్య రామాలయానికి బంగారపు ఇటుక ఇస్తానన్న మొఘల్ వారసుడు!
- కిలో బంగారపు ఇటుకను ప్రధాని మోదీకి ఇస్తా
- హిందువులకు హృదయపూర్వక అభినందనలు
- ప్రిన్స్ యాకూబ్ హబీదుద్దీన్ టూసీ
అయోధ్యలో నిర్మించతలపెట్టిన రామాలయానికి బంగారపు ఇటుకను కానుకగా ఇస్తానని మొఘల్ వారసుడు ప్రిన్స్ యాకూబ్ హబీదుద్దీన్ టూసీ ప్రకటించారు. కిలో బరువున్న ఇటుకను ప్రధాని నరేంద్ర మోదీకి అందిస్తానని, దీన్ని ఆలయ నిర్మాణంలో వాడవచ్చని తెలిపారు. 100 కోట్ల మంది హిందువుల మనోభావాలను, నమ్మకాన్ని నిలిపి ఉంచుకునే సమయం ఇదని ఆయన వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా హిందువులకు తాను హృదయ పూర్వకంగా అభినందనలు తెలుపుతున్నానని, ప్రధానిని కలిసేందుకు సమయం ఇవ్వాలని కూడా కోరానని ఆయన అన్నారు.
కాగా, తాను మొఘలుల వారసుడినని చెప్పుకునే హబీదుద్దీన్ టూసీ గత సంవత్సరంలో కూడా వార్తల్లో నిలిచారు. తనను బాబ్రీ మసీదు కేర్ టేకర్ గా నియమించాలని ఆయన డిమాండ్ చేశారు.
ఆగస్టు 5వతేదీన మధ్యాహ్నం 12.15 గంటలకు అయోధ్యలో రామాలయానికి ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా శంకుస్థాపన చేయనున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి కొద్దిమంది ప్రముఖులనే ఆహ్వానిస్తున్నప్పటికీ, వైభవంగా జరిపించేందుకు యూపీ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. సీఎం ఆదిత్యనాథ్ ఇప్పటికే రెండుసార్లు అయోధ్యలో జరుగుతున్న ఏర్పాట్లను స్వయంగా పరిశీలించారు.