BJP: ఆ వార్తల్లో నిజం లేదు.. బీజేపీలోనే ఉంటా: ముకుల్ రాయ్ స్పష్టీకరణ
- బీజేపీని వీడి టీఎంసీలో చేరుతున్నట్టు పుకార్లు
- బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు దిలీప్‌తో భేదాభిప్రాయాలు ఉన్నట్టు వార్తలు
- చివరికంటా బీజేపీతోనే ఉంటానన్న ముకుల్ రాయ్
తాను బీజేపీని వదిలేసి తిరిగి తృణమూల్ కాంగ్రెస్ పార్టీ గూటికి చేరుతున్నట్టు వస్తున్న వార్తలను సీనియర్ నేత ముకుల్ రాయ్ కొట్టిపడేశారు. తాను బీజేపీలోనే ఉన్నానని, చివరికంటా దానితోనే ఉంటానని స్పష్టం చేశారు. బెంగాల్‌లో త్వరలో జరగనున్న ఎన్నికల బాధ్యతను అధిష్ఠానం తనకు అప్పగించిందని, పార్టీ తనకు పూర్తి గౌరవ మర్యాదలు ఇస్తోందని పేర్కొన్నారు. తాను బీజేపీని వీడుతున్నట్టు వస్తున్న వార్తలు పూర్తిగా సత్యదూరమని తేల్చి చెప్పారు. బీజేపీ బెంగాల్ అధ్యక్షుడు దిలీప్ ఘోష్‌తో తనకు ఎటువంటి అభిప్రాయ భేదాలు లేవని ముకుల్ రాయ్ పేర్కొన్నారు.
బీజేపీలో ఎవరి స్వేచ్ఛ వారికి ఉన్నా అందరం కలిసి ఒకే లక్ష్యం కోసం పనిచేస్తామన్నారు. తనకు కేంద్ర మంత్రి పదవి దక్కకపోవడంపై స్పందించిన ముకుల్ రాయ్ తనకే పదవులు అక్కర్లేదని, పార్టీ బలోపేతంపైనే తన దృష్టంతా ఉందని వివరించారు. పార్టీలో ముకుల్ రాయ్ ఎంతో కీలక మైన వ్యక్తి అని, పార్టీ మారుతున్నట్టు వస్తున్న వార్తల్లో నిజం లేదని బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్, జాతీయ ప్రధాన కార్యదర్శి కైలాశ్ విజయ వర్గీయ పేర్కొన్నారు.