Bengaluru: రెండు రోజులైనా దొరకని సింధూరెడ్డి ఆచూకీ.. నేడు లైఫ్‌బోట్లతో గాలింపు
- బెంగళూరు నుంచి కారులో హైదరాబాద్‌కు
- గద్వాల జిల్లాలోని కలుగొట్ల వాగులో కొట్టుకుపోయిన కారు
- గాలింపు చర్యలు ముమ్మరం చేసిన పోలీసులు
బెంగళూరు నుంచి కారులో హైదరాబాద్ వస్తూ గద్వాల జిల్లాలోని కలుగొట్ల వాగులో శనివారం తెల్లవారుజామున గల్లంతైన సింధూరెడ్డి (28) ఆచూకీ ఇప్పటికీ లభ్యం కాలేదు. రెండు రోజులుగా గాలిస్తున్నా ఆమె ఆచూకీ దొరక్క పోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన నాగసింధూరెడ్డి, శివశంకర్‌రెడ్డి భార్యాభర్తలు. స్నేహితుడు జిలానీబాషాతో కలిసి బెంగళూరు నుంచి కారులో హైదరాబాద్ బయలుదేరారు. కర్నూలు దాటిన తర్వాత రహదారి దిగి అడ్డదారిలో ప్రయాణిస్తుండగా కలుగొట్ల వద్ద రహదారిపై నుంచి వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది.
ప్రవాహ ఉద్ధృతిని అంచనా వేయడంలో విఫలమైన వారు కారును అలాగే ముందుకు పోనివ్వడంతో మధ్యలోనే కారు ఆగిపోయింది. దీంతో కారు దిగిన బాషా, శివశంకర్‌రెడ్డి వెనక సీట్లో నిద్రపోతున్న సింధును బయటకు తీసేందుకు ప్రయత్నిస్తుండగానే కారు నీటిలో కొట్టుకుపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు, రెవెన్యూ సిబ్బంది, స్థానికులు గాలింపు మొదలుపెట్టారు.
కారును 500 మీటర్ల దూరంలో ముళ్లపొదల్లో గుర్తించారు. అలాగే సింధు హ్యాండ్‌బ్యాగ్‌ను గుర్తించారు. అయితే, ఆమె ఆచూకీ మాత్రం లభ్యం కాలేదు. శనివారం సాయంత్రం ఏడు గంటల వరకు గాలించిన పోలీసులు నిన్న తిరిగి గాలింపు చర్యలు కొనసాగించారు. అయినప్పటికీ ఆమె జాడ తెలియరాలేదు. ఎస్పీ ఆదేశాలతో నేడు లైఫ్‌బోట్లతో గాలింపు చర్యలు చేపడతామని సీఐ తెలిపారు.