Omar Abdullah: జమ్మూకశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంతంగా ఉన్నంత వరకు పోటీ చేయను: మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా ప్రకటన
- ఓ జాతీయ పత్రికకు రాసిన వ్యాసంలో సంచలన ప్రకటన
- బలమైన తాను బలహీనమైన సభలో సభ్యుడిగా ఉండలేనని వ్యాఖ్య
- కేంద్రం తన నిర్ణయాలతో కశ్మీరీలను అవమానించిందన్న ఒమర్
జమ్మూకశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంతంగా ఉన్నంత వరకు ఎన్నికల్లో పోటీ చేయబోనని మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా సంచలన ప్రకటన చేశారు. ఓ జాతీయ పత్రికకు రాసిన వ్యాసంలో ఆయనీ వ్యాఖ్యలు చేశారు. ఆర్టికల్ 370, ఆర్టికల్ 35ఎ రద్దు వంటివి తమను పూర్తిగా ఆశ్చర్యపరిచాయని పేర్కొన్నారు. నిజం చెప్పాలంటే తమకు షాక్ అని ఆయన అన్నారు. కేంద్రం ఈ నిర్ణయంతో కశ్మీరీలను తీవ్రంగా అవమానించిందని, ప్రజలకు ఒక రకంగా శిక్ష విధించిందని మండిపడ్డారు.
అసలు జమ్మూకశ్మీర్‌ను కేంద్ర పాలిత ప్రాంతం చేయడమేంటో తనకు ఇప్పటికీ అర్థం కాలేదని అన్నారు. తాను అత్యధిక కాలం శాసనసభలో ఉన్నానని, ఆరేళ్లపాటు నాయకుడిగా ఉండి నడిపించానని పేర్కొన్న ఒమర్.. ఇంత బలహీనమైన, అధికారంలో లేని సభలో సభ్యుడిగా ఉండలేనని తేల్చి చెప్పారు. రాష్ట్రం కేంద్ర పాలిత ప్రాంతంగా ఉన్నంత వరకు ఎన్నికల్లో పోటీ చేయబోనని స్పష్టం చేశారు.