Harbhajan Singh: మా ఏరియాలో ఉన్న అందరి కరెంటు బిల్లూ నాకే పంపారా?: హర్భజన్ సింగ్
- హర్భజన్ కు రూ. 33,900 కరెంట్ బిల్లు
- అదానీ ఎలెక్ట్రిసిటీపై అసహనం వ్యక్తం చేసిన వెటరన్ స్పిన్నర్
- కరోనా కాలంలో జనాల కష్టాలు పెంచుతున్నారని వ్యాఖ్య
తనకు భారీగా కరెంట్ బిల్లు రావడంతో వెటరన్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ అసహనం వ్యక్తం చేశాడు. తమ ఏరియాలో ఉన్న అందరి కరెంట్ బిల్లు తనకే పంపించారా? అని ప్రశ్నించాడు. సాధారణంగా వచ్చే కరెంట్ బిల్లు కంటే ఏడు రెట్లు ఎక్కువ బిల్లును పంపించారని విమర్శించాడు. అదానీ ఎలెక్ట్రిసిటీ హ్యాష్ ట్యాగ్ ని కూడా తన ట్వీట్ లో జత చేశాడు.
ఇప్పటికే కరోనాతో జనాలు చాలా ఇబ్బంది పడుతున్నారని... భారీ కరెంట్ బిల్లులతో విద్యుత్ సంస్థలు జనాలను మరింత కష్టపెడుతున్నాయని అన్నాడు. హర్భజన్ కు ఈ నెల కరెంట్ బిల్లు రూ. 33,900 వచ్చింది. వచ్చే నెల 17వ తేదీలోగా బిల్లు కట్టాలని పేర్కొన్నారు.
కరోనా సమయంలో దాదాపు అన్ని రాష్ట్రాల్లో భారీగా కరెంట్ బిల్లులు వస్తున్న సంగతి తెలిసిందే. కొందరికి లక్షల్లో కూడా బిల్లులు వచ్చాయి. ఈ నేపథ్యంలో విద్యుత్ సంస్థలపై జనాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.