India: లాహోర్‌లోని ‘షహీదీ ఆస్థాన్’ గురుద్వారాను ‘షహీద్ గంజ్’ మసీదుగా మార్చే కుట్ర
- కొత్త వాదనను తెరపైకి తెచ్చిన మతవాదులు
- తీవ్ర అభ్యంతరం తెలిపిన భారత్
- ఆ ప్రయత్నాలను అడ్డుకోవాలంటూ పాక్ హైకమిషన్‌కు లేఖ
లాహోర్‌లో ఉన్న సిక్కుల గురుద్వారాను మసీదుగా మార్చేందుకు పాకిస్థాన్ ప్రయత్నాలు ప్రారంభించింది. నగరంలోని నౌలఖా బజార్లో ఉన్న షహీదీ ఆస్థాన్ గురుద్వారాను సిక్కులు పరమ పవిత్రమైనదిగా భావిస్తారు. భాయ్ తరుసింగ్ జీ ఇక్కడే అమరుడయ్యాడని సిక్కులు చెబుతారు. అయితే, అక్కడి మతవాదులు మాత్రం అది షహీద్ గంజ్ అనే మసీదని వాదిస్తున్నారు.
విషయం తెలిసిన భారత్ పాక్ ప్రయత్నాలను తీవ్రంగా ఖండించింది. గురుద్వారాను మసీదుగా మార్చే ప్రయత్నాలు జరుగుతుండడంపై తీవ్ర నిరసన వ్యక్తం చేసిన భారత్.. ఢిల్లీలోని పాక్ హైకమిషన్‌కు సోమవారం లేఖ అందజేసింది. ఈ ఘటనపై విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలని కోరింది. పాకిస్థాన్‌లోని మైనారిటీల రక్షణ, వారి మత స్వేచ్ఛకు కట్టుబడి ఉండాలని విజ్ఞప్తి చేసింది.
కాగా, పాక్ మతాధిపత్యాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టు అకాళీదల్ అధికార ప్రతినిధి, ఢిల్లీ సిక్కు గురుద్వారా మేనేజ్మెంట్ కమిటీ అధ్యక్షుడు మజీందర్ సింగ్ సీర్సా చెప్పారు. గురుద్వారాను మసీదుగా మార్చే ప్రయత్నంపై ప్రపంచవాప్తంగా ఉన్న సిక్కులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నట్టు చెప్పారు. ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని పాక్ ప్రధాని ఇమ్రాన్‌ను కోరారు.