jobs: నిరుద్యోగులకు ఊరట.. దేశంలో పెరుగుతోన్న ఉద్యోగాలు
- సీఎంఐఈ నివేదికలో ఆసక్తికర విషయాలు
- కొత్తగా పలు రంగాల్లో ఉద్యోగాలు అందుబాటులోకి
- ఈ నెల 19 నాటికి ఉద్యోగిత రేటు 38.4 శాతానికి పెరుగుదల
దేశంలో కరోనా విజృంభణతో విధించిన లాక్‌డౌన్ కారణంగా లక్షలాది మంది ఉపాధి కోల్పోయిన విషయం తెలిసిందే. ఇప్పట్లో ఉపాధి అవకాశాలు మెరుగుపడవనే ఊహాగానాలు వినిపించాయి. అయితే, సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియా ఎకానమీ (సీఎంఐఈ) నివేదికలో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి.
ఈ నెలలో నగరాల్లో కొత్తగా పలు ఉద్యోగాలు అందుబాటులోకి వచ్చాయని, దీంతో నిరుద్యోగ రేటు తగ్గుముఖం పట్టిందని సీఎంఐఈ తెలిపింది. ఈ నెల 19 నాటికి ఉద్యోగిత రేటు 38.4 శాతానికి పెరిగిందని తెలిపింది. గత నెలతో పాటు ఈ నెలలోనూ ఉపాధి రేటు పెరగడం శుభసూచికమని చెప్పింది.
ఈ నెల తొలి మూడు వారాల్లో సగటు ఉపాధి రేటు 37.5 శాతం గా ఉంది. నిత్యావసరాల సరఫరా రంగంలోనే కాకుండా సేవల రంగంలోనూ కొత్త ఉద్యోగాలు పుట్టుకొస్తున్నాయని ఆ సంస్థ పేర్కొంది. ఉపాధి అవకాశాల మెరుగుదల ఇలాగే కొనసాగితే ఉద్యోగ మార్కెట్‌లోనూ భారీ రికవరీ చోటుచేసుకుంటుందని చెప్పింది.