Jagan: నాకు బెడ్ దొరకలేదు అని ఎవరైనా అంటే మన మానవత్వమే ప్రశ్నార్థకమవుతుంది: సీఎం జగన్
- అధికారులతో సీఎం జగన్ సమీక్ష
- బెడ్ లేదు అనే మాట వినిపించకూడదని స్పష్టీకరణ
- తీవ్ర నేరం అవుతుంది అంటూ హెచ్చరిక
ఏపీలోని ఆసుపత్రుల్లో కరోనా రోగులకు బెడ్ లేదు అనే పరిస్థితి రాకూడదని సీఎం జగన్ అధికారులకు స్పష్టం చేశారు. కరోనా రోగి ఆసుపత్రిలో జాయిన్ అయిన అరగంట లోపే బెడ్ కేటాయించాలని అన్నారు. బెడ్ లేదు అనే మాట ఎట్టి పరిస్థితుల్లోనూ వినిపించకూడదని, ఒకవేళ ఎవరైనా కరోనా పేషెంట్ తనకు బెడ్ దొరకలేదు అంటే అది మన మానవత్వానికి ప్రశ్నార్థకమవుతుందని పేర్కొన్నారు.
"ఏ ఒక్క కరోనా రోగి కూడా నేను ఎంత ప్రయత్నించినా బెడ్ దొరకలేదు అని చెప్పారంటే నేరుగా కలెక్టర్లు, జేసీలనే బాధ్యుల్ని చేస్తాం. ఆసుపత్రి సిబ్బంది కూడా ఈ విషయంలో మానవీయ దృక్పథంతో వ్యవహరించాలి. కరోనా రోగులకు బెడ్లు ఏర్పాటు చేసేందుకు సహకరించాలి. మా ఆసుపత్రిలో బెడ్ లేదు, మేం ఇవ్వం ఇని ఎవరైనా చెబితే అది తీవ్ర నేరం అవుతుంది" అంటూ సీఎం జగన్ హెచ్చరించారు.