Ashok Gehlot: గవర్నర్ కు కొత్త ప్రపోజల్ పెట్టిన అశోక్ గెహ్లాట్ 

Ashok Gehlots new proposal to Governor on Assembly Session
  • సస్పెన్స్ థ్రిల్లర్ ను తలపిస్తున్న రాజస్థాన్ రాజకీయం
  • అసెంబ్లీని సమావేశపరచాలని కోరుతున్న కాంగ్రెస్
  • మూడు కండిషన్లు పెట్టిన గవర్నర్
రాజస్థాన్ లో నెలకొన్న రాజకీయ సంక్షోభం సస్పెన్స్ థ్రిల్లర్ ను తలపిస్తోంది. డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ తన వర్గీయులతో కలిసి తిరుగుబాటు చేయడంతో... అశోక్ గెహ్లాట్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారాన్ని కోల్పోయే ప్రమాదంలో పడింది. కావాల్సిన మెజార్టీ కంటే కేవలం ఒక్క ఎమ్మెల్యే మాత్రమే కాంగ్రెస్ కు ఎక్కువగా ఉన్నారు. గత ఏడాది బీఎస్పీ ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించి, కాంగ్రెస్ లో చేరారు. వీరే లేకపోతే గెహ్లాట్ ప్రభుత్వం ఇప్పటికే కూలిపోయి ఉండేది. మరోవైపు అసెంబ్లీలో బల నిరూపణకు అనుమతించాలంటూ గవర్నర్ ను ఇప్పటికే రెండు సార్లు అశోక్ గెహ్లాట్ కోరారు. అయితే, గవర్నర్ అనుమతిని ఇవ్వలేదు.

అసెంబ్లీ సెషన్ ఏర్పాటు చేయడానికి గవర్నర్ కల్రాజ్ మిశ్రా మూడు కండిషన్లను పెట్టారు. ప్రస్తుత కరోనా సమయంలో ఎమ్మెల్యేలను ఇప్పటికిప్పుడే పిలవడం సాధ్యం కాదని ఆయన చెప్పారు. ఎమ్మెల్యేలకు 21 రోజుల ముందస్తు నోటీసు ఇవ్వాలని తెలిపారు. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా అసెంబ్లీలో చర్యలు తీసుకోవాలని చెప్పారు.

ఈ నేపథ్యంలో ఈ ఉదయం అశోక్ గెహ్లాట్ కేబినెట్ సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం ఈనెల 31వ తేదీన అసెంబ్లీని సమావేశపరచాలని గవర్నర్ కు మూడోసారి వినతి పత్రాన్ని పంపారు. అయితే బల నిరూపణ అంశాన్ని ఈ వినతిపత్రంలో ప్రభుత్వం పేర్కొనలేదు. తమ ప్రభుత్వానికి మెజారిటీ ఉందనే విషయాన్ని మాత్రమే పేర్కొన్నారు. 'మా ప్రభుత్వానికి కావాల్సినంత మెజార్టీ ఉంది. మీరు కోరుకుంటే బలాన్ని నిరూపించుకుంటాం' అని తెలిపారు. ఈ నేపథ్యంలో, గవర్నర్ ఎలాంటి నిర్ణయం తీసుకోనున్నారనే విషయంపై ఉత్కంఠ నెలకొంది.
Ashok Gehlot
Congress
Rajasthan
Trust Vote
Kalraj Mishra

More Telugu News