Etela Rajender: ఎవరు ఎలా చనిపోయినా.. కరోనాతో చనిపోయినట్టు భయపడుతున్నారు: ఈటల
- రాష్ట్రంలో ప్రతి రోజు వెయ్యి మంది చనిపోతారు
- కరోనా మరణాల్లో గోప్యత పాటించాల్సిన అవసరం లేదు
- కోవిడ్ ఆసుపత్రుల్లో అన్ని సౌకర్యాలను కల్పిస్తున్నాం
కరోనా మరణాల్లో తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి గోప్యతను పాటించడం లేదని రాష్ట్ర ఆరోగ్య మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. గోప్యత పాటించాల్సిన అవసరం కూడా ప్రభుత్వానికి లేదని చెప్పారు. రాష్ట్రంలో ప్రతి రోజు వెయ్యి మంది చనిపోతారని... వారంతా కరోనా వల్లే చనిపోయారని చెప్పడంలో అర్థం లేదని అన్నారు. ఎవరు ఎలా చనిపోయినా కరోనాతో చనిపోయినట్టు భయపడుతున్నారని చెప్పారు.
ప్రజలు అప్రమత్తంగా ఉంటే కరోనాను కట్టడి చేయవచ్చని ఈటల అన్నారు. కరోనా ఆసుపత్రుల్లో ఎలాంటి లోటు లేకుండా అన్ని సౌకర్యాలను కల్పిస్తున్నామని చెప్పారు. ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లి అనవసరంగా డబ్బును ఖర్చు చేసుకోవద్దని తెలిపారు. ర్యాపిడ్ యాంటిజెన్ కిట్ తో కరోనా టెస్ట్ చేసి 30 నిమిషాల్లోనే ఫలితాలను వెల్లడిస్తున్నామని చెప్పారు. హైదరాబాద్ గాంధీ ఆసుపత్రి తర్వాత అతి పెద్ద ఆసుపత్రి వరంగల్ లోని ఎంజీఎం ఆసుపత్రేనని తెలిపారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని కరోనా కేసులకు ఎంజీఎంలోనే చికిత్స అందిస్తామని చెప్పారు. వరంగల్ నుంచి ఒక్క కరోనా కేసును కూడా హైదరాబాదుకు పంపించొద్దని అధికారులకు సూచించారు.