Vegetables: ఇలా కూడా కూరగాయలను శానిటైజ్ చేయచ్చంటున్న యువకుడు!
- ఓ యువకుడి వినూత్న ప్రయత్నం
- కుక్కర్ విజిల్ కు పైప్ తొడిగి ప్రయోగం
- వీడియో షేర్ చేసిన ఐఏఎస్ ఆఫీసర్ సుప్రియా సాహు
ఈ కరోనా సమయంలో ఏ వస్తువును తాకాలన్నా ఎక్కడ వైరస్ సోకుతుందోనన్న భయం ప్రతి ఒక్కరిలో ఉంది. ఈ సమయంలో మార్కెట్ నుంచి కొనుగోలు చేసి, ఇంటికి తెచ్చిన కూరగాయలను తాకాలా? వద్దా?అన్న సందేహాలూ నెలకొన్న తరుణంలో, కూరగాయలను శానిటైజ్ చేసి, వాటిపై ఉన్న సూక్ష్మ క్రిములను హతమార్చేందుకు ఓ యువకుడు వినూత్న ప్రక్రియను అవలంబించాడు. ఇందుకోసం అతను ఓ కుక్కర్ ను వినియోగించాడు.
ఇందుకు సంబంధించిన వీడియోను ఐఏఎస్ అధికారిణి సుప్రియా సాహు తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేయగా, అదిప్పుడు వైరల్ అయింది. ఇంతకీ అతను చేసిందేంటో తెలుసా? ప్రెజర్ కుక్కర్ లో విజిల్ కు ఓ పైపు తొడిగి, దాని రెండో చివరను కూరగాయల మీద ఉంచడమే. దీంతో అత్యంత సహజ సిద్ధమైన పద్ధతిలో కూరగాయల మీదకు వేడి నీటి ఆవిరి వెళ్లి అవి శుభ్రపడ్డాయి. పలు రకాల కూరగాయలు ఈ ఆవిరితో క్రిమిరహితం అవుతాయని అతను అంటున్నాడు.
ఇక అతని ప్రయత్నాన్ని సుప్రియా సాహు మెచ్చుకోగా, ఇది ప్రమాదకరమైన పద్ధతని, కూరగాయలను సబ్బునీళ్లలో వేసి కడిగితే సరిపోతుందని కొందరు వ్యాఖ్యానించారు. మరికొందరైతే, ఆవిరితో శుభ్రపరిచిన కూరగాయలు తింటే, క్యాన్సర్ బారినపడే అవకాశాలు కూడా ఉన్నాయని హెచ్చరించడం గమనార్హం.