Tamil Nadu: ఉపాధి కల్పించాలంటూ.. తమిళనాడులో కోర్టు ఎదుట న్యాయవాది నగ్నంగా ఆందోళన
- లాక్‌డౌన్ కారణంగా నిలిచిపోయిన కోర్టు వ్యవహారాలు
- ఉపాధి పోవడంతో ఆర్థికంగా ఇబ్బందులు
- సమస్య పరిష్కరించాలంటూ కోర్టు ఎదుట ఆందోళన
కరోనా లాక్‌డౌన్ కారణంగా కోర్టు పనులకు అంతరాయం ఏర్పడడంతో ఉపాధి కోల్పోయి ఇబ్బందులు పడుతున్న ఓ న్యాయవాది తనకు జీవనాధారం కల్పించాలంటూ కోర్టు ఎదుట నగ్నంగా ఆందోళనకు దిగాడు. తమిళనాడులోని విరుదునగర్ జిల్లా సాత్తూరులో జరిగిందీ ఘటన.
ఆండాళ్‌పురానికి చెందిన మణికంఠన్ (36) ఉమ్మడి కోర్టులో న్యాయవాదిగా పనిచేస్తున్నాడు. అయితే, లాక్‌డౌన్ కారణంగా కోర్టు వ్యవహారాలు నిలిచిపోవడంతో ఆర్థికంగా పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. దీంతో ఏం చేయాలో దిక్కుతోచని మణికంఠన్ సాత్తూరు మెయిన్ రోడ్డులో ఉన్న కోర్టు ఎదుట నగ్నంగా కూర్చుని ఆందోళనకు దిగాడు. తనకు ఉపాధి కల్పించాలని డిమాండ్ చేశాడు. విషయం తెలిసి రంగంలోకి దిగిన పోలీసులు కోర్టు వద్దకు చేరుకుని మణికంఠన్‌కు సర్దిచెప్పి ఆందోళన విరమింపజేశారు. అయితే, సమస్య పరిష్కారం కాకుంటే మాత్రం రేపు (శుక్రవారం) ఆమరణ దీక్షకు దిగుతానని హెచ్చరించాడు.