Ashok Gehlot: రాజస్థాన్ రాజకీయ ఉత్కంఠ.. అసెంబ్లీ సమావేశానికి గవర్నర్ గ్రీన్ సిగ్నల్
- ఆగస్ట్ 14న రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలు
- ఉత్తర్వులు జారీ చేసిన గవర్నర్
- బల నిరూపణకు సిద్ధమవుతున్న గెహ్లాట్
రాజస్థాన్ రాజకీయం ఉత్కంఠభరిత మలుపులు తిరుగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ తన కోరికను నెగ్గించుకున్నారు. రాజస్థాన్ అసెంబ్లీని ఆగస్ట్ 14న సమావేశపరుస్తున్నట్టు గవర్నర్ కల్రాజ్ మిశ్రా ఉత్తర్వులు జారీ చేశారు. తాము బలపరీక్షలో నిరూపించుకుంటామని... అసెంబ్లీ సమావేశాన్ని ఏర్పాటు చేయాలంటూ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ పదేపదే కోరినప్పటికీ గవర్నర్ కల్రాజ్ మిశ్రా సుముఖత వ్యక్తం చేయని సంగతి తెలిసిందే. ఈ నెల 31న అసెంబ్లీని సమావేశపరచాలన్న గెహ్లాట్ కోరికను తిరస్కరించిన గవర్నర్... 14వ తేదీన సమావేశాలకు పచ్చ జెండా ఊపారు.
ఈ సందర్భంగా కల్రాజ్ మిశ్రా మాట్లాడుతూ, కరోనా వైరస్ నేపథ్యంలో 21 రోజుల ముందస్తు నోటీసును ఎమ్మెల్యేలకు ఇవ్వకుండా సమావేశాలను ఏర్పాటు చేయాలని కోరడం సరికాదని అన్నారు. బల నిరూపణకు ప్రభుత్వం సిద్ధమయ్యే పక్షంలో... కోవిడ్ నిబంధనలను పాటిస్తూ షార్ట్ సెషన్ ను ఏర్పాటు చేసుకోవడం బెస్ట్ అని చెప్పారు. అసెంబ్లీ సమావేశాలకు డేట్ ఫిక్స్ కావడంతో... క్యాంపు రాజకీయాలు మరింత వేడెక్కనున్నాయి. మేజిక్ ఫిగర్ కంటే కేవలం ఒక్క ఎమ్మెల్యే మాత్రమే ఎక్కువగా ఉన్న నేపథ్యంలో... ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా మిస్ కాకుండా చూసుకోవాల్సిన పరిస్థితి కాంగ్రెస్ కు ఉంది. మరోవైపు, సచిన్ పైలట్ ఏం చేయబోతున్నారనే విషయం ఆసక్తికరంగా మారింది.