Sanchaita: అశోక్ గజపతిరాజుకు మరోసారి కౌంటర్ ఇచ్చిన సంచయిత
- సింహాచలం దేవాలయానికి ప్రసాద్ పథకం వర్తింపు
- కేంద్రం ప్రకటన
- 2017లో తాము ప్రసాద్ పథకానికి దరఖాస్తు చేశామన్న అశోక్ గజపతి
- ఈవో దరఖాస్తు చేయలేడన్న సంచయిత
ఏపీలో సుప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా విలసిల్లుతున్న సింహాచలం వరాహ లక్మీనరసింహ స్వామి దేవస్థానానికి కేంద్రం ప్రసాద్ పథకం వర్తింపజేస్తున్నట్టు ప్రకటించడం తెలిసిందే. తమ ప్రయత్నం వల్లే ఇది సాకారమైందని మాన్సాస్ ట్రస్టు చైర్ పర్సన్ సంచయిత గజపతి పేర్కొనగా, సింహాచలం ఆలయానికి ప్రసాద్ పథకం వర్తింపజేయడం కోసం తాము 2017లోనే దరఖాస్తు చేశామని ఆమె బాబాయి అశోక్ గజపతిరాజు ట్వీట్ చేశారు. ఈ మేరకు నాటి సింహాచలం దేవస్థాన ఈవో దరఖాస్తును దేవాదాయ శాఖ కమిషనర్ కు ఫార్వర్డ్ చేసిన ప్రతిని కూడా అశోక్ గజపతిరాజు ట్విట్టర్ లో పంచుకున్నారు.
దీనిపై సంచయిత వెంటనే స్పందించారు. నిజానిజాల నిర్ధారణ (ఫ్యాక్ట్ చెక్) అంటూ ట్వీట్ చేశారు. కేంద్ర పథకాన్ని ఆలయానికి వర్తింపజేయాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వానికి ఓ ఈవో దరఖాస్తు చేయజాలడని స్పష్టం చేశారు.
"ఆ పని చేయాల్సింది రాష్ట్ర ప్రభుత్వం. సింహాచలం దేవస్థానానికి ప్రసాద్ పథకం కోసం చంద్రబాబు ప్రభుత్వం దరఖాస్తు చేయలేదు, మీరు అంతకన్నా చేయలేదు. నా విన్నపం మేరకు సీఎం జగన్ ప్రభుత్వం సింహాచలం ఆలయాన్ని కేంద్రానికి ప్రతిపాదించింది. ఏపీ నుంచి ప్రతిపాదించిన 3 ఆలయాల్లో సింహాచలం ఆలయాన్ని కూడా చేర్చింది" అంటూ వివరించారు.
అంతేకాదు, సింహాచలం దేవస్థానం కూడా ప్రసాద్ పథకానికి ఎంపికైన సందర్భంగా కేంద్ర టూరిజం విభాగం చేసిన ట్వీట్ ను సంచయిత పంచుకున్నారు. ఈ ఆలయాన్ని అద్భుతమైన రీతిలో అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారంటూ టూరిజం శాఖ తన ట్వీట్ లో సంచయితను అభినందించింది.