Nara Lokesh: కరోనా రోగి బాత్రూంలో పడి చనిపోయిన ఘటన తీవ్రంగా కలచివేసింది: నారా లోకేశ్
- నెల్లూరు ఆసుపత్రిలో కరోనా రోగి మృతి!
- తీవ్రంగా స్పందించిన లోకేశ్
- ప్రభుత్వ చర్యలు అధ్వానం అంటూ ఆగ్రహం
నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఓ కరోనా రోగి బాత్రూంలో పడి చనిపోయిన ఘటన తీవ్రంగా కలచివేసిందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ వ్యాఖ్యానించారు. కరోనాను ఎదుర్కోవడం కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఎంత అధ్వానంగా ఉన్నాయో ఈ ఒక్క సంఘటన ద్వారా తెలుస్తోందని విమర్శించారు. సీఎం జగన్ మాటలు కోటలు దాటుతున్నాయి కానీ, చేతలు గడప కూడా దాటడంలేదని ప్రజలు పడుతున్న కష్టాలే చెబుతున్నాయని విమర్శించారు.
కొవిడ్ ఆసుపత్రుల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు చూస్తుంటే ఎంతో బాధగా ఉందని పేర్కొన్నారు. క్వారంటైన్ కేంద్రాల్లో వసతులు శూన్యమని, ఆసుపత్రుల్లో సరైన వైద్యం అందడంలేదని ఆరోపించారు. నిత్యం కరోనాపై ముందు నిలిచి పోరాడుతున్న వైద్య సిబ్బంది రోడ్ల మీదకు వచ్చి నాణ్యమైన పీపీఈ కిట్లు ఇవ్వాలి అంటూ ఆందోళనలు చేస్తున్నారని లోకేశ్ ట్విట్టర్ లో ధ్వజమెత్తారు. జగన్ రెడ్డి గారూ, కరోనా మీకు పెద్ద విషయం కాకపోవచ్చు కానీ, ప్రజల ప్రాణాలు విలువైనవి అంటూ హితవు పలికారు.