Sujana Chowdary: ఏపీ రాజధాని విషయంలో కేంద్రం సరైన సమయంలో జోక్యం చేసుకుంటుంది: సుజనా చౌదరి
- రాష్ట్ర ప్రభుత్వ పనులు హాస్యాస్పదం అంటూ వ్యాఖ్యలు
- ఎస్ఈసీ అంశంలో పిచ్చుకపై బ్రహ్మాస్త్రం ప్రయోగిస్తున్నారని విమర్శ
- రాజధానులు పెంచుకుంటూ పోవడం సరికాదని హితవు
ఏపీ రాజకీయ పరిణామాలపై బీజేపీ ఎంపీ సుజనా చౌదరి స్పందించారు. ఎస్ఈసీ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం పిచ్చుకపై బ్రహ్మాస్త్రం ప్రయోగిస్తున్నట్టుగా ఉందని అన్నారు. ప్రభుత్వం మారింది కదా అని చట్టాలు మారిపోవని, ప్రభుత్వ వైఖరితో ఒక్క ప్రాజెక్టు కూడా ముందుకు కదల్లేదని విమర్శించారు. ఏపీలో ప్రభుత్వం చేసే పనులు హాస్యాస్పదంగా ఉన్నాయని ఎద్దేవా చేశారు. భారీ మెజారిటీతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన వైసీపీ ఇకనైనా అభివృద్ధి కోసం చర్యలు తీసుకోవాలని, రాజధానులు పెంచుకుంటూ పోవడం సరికాదని హితవు పలికారు. ఇక, కీలక బిల్లుల గురించి కూడా సుజనా వ్యాఖ్యానించారు.
"శాసనమండలి ఆమోదించకుండా రాజధాని బిల్లును గవర్నర్ వద్దకు ఎలా పంపుతారు? అది రాజ్యాంగ విరుద్ధమవుతుంది. ఇంతకీ రాజధాని మార్పు ఫైల్ ఎక్కడుంది? దానికి సెలెక్ట్ కమిటీ ఆమోదం లభించిందా? లేదా? అదీ తెలియదు. ఎవరెంత చేసినా, మన రాజ్యాంగం ప్రకారం రాష్ట్ర రాజధాని అంశంలో తుది నిర్ణయం కేంద్ర ప్రభుత్వానిదే అవుతుంది. రాజ్యసభ సభ్యుడిగా చెబుతున్నా... ఈ విషయంలో కేంద్రం సరైన సమయంలో జోక్యం చేసుకుంటుంది" అంటూ సుజనా తన అభిప్రాయాలు వెల్లడించారు.