Rajasthan: రెబల్ ఎమ్మెల్యేలకు 'అపరిమిత ఆఫర్లు': బీజేపీపై గెహ్లాట్ ఫైర్
- తొలుత రూ. 10 కోట్లు ఇచ్చారు.. ఆ తర్వాత రూ. 15 కోట్లు ఆఫర్ చేశారు
- ఇప్పుడు ఎంత కావాలో చెప్పాలంటున్నారు
- మాయావతి బీజేపీకి వంత పాడుతున్నారు
కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యేలకు బీజేపీ అన్‌లిమిటెడ్ ఆఫర్లు ప్రకటిస్తోందని రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ పరోక్ష వ్యాఖ్యలు చేశారు. ఇప్పటి వరకు ఒక్కో ఎమ్మెల్యేకు తొలి విడతగా రూ. 10 కోట్లు అడ్వాన్స్‌గా ఇచ్చారని, రెండో విడతగా రూ. 15 కోట్లు ఇస్తామన్నారని, ఇప్పుడు ఏకంగా ఎంత కావాలో చెప్పాలంటూ అన్‌లిమిటెడ్ ఆఫర్ ప్రకటిస్తున్నారని ఆరోపించారు. వచ్చే నెల 14 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఇప్పుడు బేరసారాలు ఊపందుకున్నాయని గెహ్లాట్ అన్నారు.
మరోవైపు, బీఎస్పీ చీఫ్ మాయావతిపైనా గెహ్లాట్ నిప్పులు చెరిగారు. కాంగ్రెస్‌లో ఆరుగురు బీఎస్పీ ఎమ్మెల్యేల విలీనంపై హైకోర్టులో మాయావతి సవాలు చేయడాన్ని ప్రస్తావిస్తూ.. ఆమె బీజేపీకి వంత పాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఎస్పీ రిట్ పిటిషన్‌పై నిన్న స్పందించిన హైకోర్టు ఆగస్టు 11 లోగా స్పందించాలని ఆదేశించింది. ఈ మేరకు అసెంబ్లీ స్పీకర్ సీపీ జోషి, శాసన సభ కార్యదర్శి, బీఎస్పీ నుంచి కాంగ్రెస్‌లో చేరిన ఆరుగురు ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేసింది.