Somireddy Chandra Mohan Reddy: కడకు తలొంచక తప్పలేదు: నిమ్మగడ్డ పునర్నియామకంపై సోమిరెడ్డి
- ఎస్ఈసీ విషయంలో కోర్టుల తీర్పులు ధిక్కరించారు
- జగన్ సలహాదారులెవరోకానీ వారికి కనీస జ్ఞానం కరవైనట్టుంది
- కోర్టులతో మొట్టికాయలు తిన్నారు
- వితండవాది అని దేశమంతా పేరుతెచ్చుకుంటున్నారు
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రధానాధికారిగా నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌ను ఏపీ ప్రభుత్వం తిరిగి నియమించిన విషయం తెలిసిందే. హైకోర్టు ఉత్తర్వుల మేరకు నిమ్మగడ్డను తిరిగి నియమిస్తున్నట్లు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ పేరుతో ప్రకటన జారీ అయింది. సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్‌లో వచ్చే తుది తీర్పునకు లోబడి పదవీ పునరుద్ధరణ నోటిఫికేషన్ ఉంటుందని పేర్కొన్నారు. ఈ మేరకు గత అర్ధరాత్రి దీనికి సంబంధించిన జీవోను ఏపీ ప్రభుత్వం జారీ చేయడం పట్ల టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి స్పందించారు.
'ఎస్ఈసీ విషయంలో వైఎస్ జగన్ ప్రభుత్వం అనేకసార్లు హైకోర్టు, సుప్రీంకోర్టుల మెట్లెక్కి వారి తీర్పులు ధిక్కరించినా కడకు తలొంచక తప్పలేదు. నిమ్మగడ్డ రమేశ్ గారి పునర్నియామకం విషయంలో ప్రభుత్వ తీరు తప్పని సామాన్య మానవుడు కూడా అభిప్రాయం వ్యక్తం చేసినా జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం లెక్కచేయలేదు.
'ఆయన సలహాదారులెవరోకానీ వారికి కనీస జ్ఞానం కరవైనట్టుంది. కోర్టులతో మొట్టికాయలు తినడంతో పాటు వితండవాది అని దేశమంతా పేరుతెచ్చుకుంటున్నారు. చివరకు ఏమైంది? ఆ రమేష్ కుమార్ గారినే అదే స్థానంలో కూర్చోబెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పటికైనా సహరాజ్యాంగ వ్యవస్థలను గౌరవిస్తారని ఆశిస్తున్నాం' అని సోమిరెడ్డి చెప్పారు.