Thulasi Reddy: ఇల్లు అలకగానే పండుగ కాదు.. జగన్ కు సవాల్ విసురుతున్నా: తులసిరెడ్డి

Thulasi Reddy challenges Jagan to go to elections

  • నిమ్మగడ్డ రమేశ్ విషయంలో జరిగిందే.. మూడు రాజధానుల విషయంలో కూడా జరుగుతుంది
  • మూడు రాజధానులు రాష్ట్రపతి ఆర్డర్ కు వ్యతిరేకం
  • జగన్ కు దమ్ముంటే ఎన్నికలకు వెళ్లాలి

మూడు రాజధానులకు ఏపీ గవర్నర్ ఆమోదముద్ర వేయడం దురదృష్టకరమని కాంగ్రెస్ సీనియర్ నేత తులసిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర చరిత్రలో ఇదొక చీకటి రోజని, ఒక దుర్దినమని అన్నారు. ఇల్లు అలకగానే పండుగ కాదని అన్నారు. ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ తయారు చేసి గవర్నర్ కు పంపిందని, దానికి గవర్నర్ ఆమోదముద్ర వేశారని... వాటన్నింటినీ కోర్టు కొట్టివేసిందని గుర్తు చేశారు. మూడు రాజధానుల విషయంలో కూడా అదే పరిస్థితి వస్తుందని చెప్పారు.

మూడు రాజధానులు ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టానికి, రాష్ట్రపతి ఆర్డర్ కు వ్యతిరేకమని తులసిరెడ్డి అన్నారు. గవర్నర్ సంతకం చేస్తే చట్టం అవుతుందని... కానీ, ఆ చట్టాలు హైకోర్టులో నిలబడవని చెప్పారు. కాబట్టి... మూడు రాజధానులకు ఆమోదముద్ర పడిందనే భ్రమల్లో ఉండేవారు... ఇల్లు అలకగానే పండుగ కాదు అనే విషయాన్ని గ్రహించాలని సూచించారు.

2014లో అసెంబ్లీ సాక్షిగా ఏపీ రాజధానిగా అమరావతిని స్వాగతిస్తున్నానని జగన్ చెప్పారని... వైసీపీ అధికారంలోకి వస్తే రాజధాని అమరాతి నుంచి తరలిపోతుందంటూ దుష్ప్రచారం చేస్తున్నారని, వాటిని నమ్మొద్దని ఎన్నికల ప్రచార సమయంలో వైసీపీ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లుతో పాటు పలువురు నేతలు చెప్పారని గుర్తు చేశారు. జగన్ కు దమ్ముంటే అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు వెళ్లాలని సవాల్ విసిరారు. మూడు రాజధానుల అంశం మీదే ఎన్నికలకు వెళ్లాలని ఛాలెంజ్ చేస్తున్నానని చెప్పారు. వెంకటేశ్వరస్వామికే పంగనామాలు పెట్టిన బీజేపీ పెద్దలు ఏమైనా చేస్తారని మండిపడ్డారు. హైకోర్టును మార్చాలంటే రాష్ట్రపతి ఆమోదం తప్పనిసరి అని అన్నారు.

  • Loading...

More Telugu News