GVL Narasimha Rao: అమరావతి రాజధానికి బీజేపీ కట్టుబడి ఉంది: జీవీఎల్ నరసింహారావు
- రాజధానుల అంశంతో కేంద్రానికి సంబంధం లేదు
- కర్నూలులో హైకోర్టు ఉండాలనేది మా పార్టీ స్టాండ్
- అమరావతి రైతులకు న్యాయం చేయాలి
ఏపీ రాజధాని అమరావతికి బీజేపీ కట్టుబడి ఉందని బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు అన్నారు. రాజధానిగా అమరావతి కొనసాగాలని తమ పార్టీ తీర్మానం కూడా చేసిందని తెలిపారు. కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలనేది తమ పార్టీ స్టాండ్ అని చెప్పారు. ఇదే సమయంలో టీడీపీపై ఆయన పరోక్షంగా విమర్శలు గుప్పించారు. కొందరు అధికారంలో ఉన్నప్పుడు గవర్నర్ వ్యవస్థను ప్రశ్నిస్తారని... ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి ఆ ఆధికారాలు లేవని అంటారని ఎద్దేవా చేశారు.
మూడు రాజధానుల అంశాన్ని గత పార్లమెంటు సమావేశాల్లో టీడీపీ ఎంపీ కేశినేని నాని లేవనెత్తారని... అప్పుడు కేంద్ర హోంశాఖ చాలా స్పష్టమైన సమాధానం ఇచ్చిందని... రాజధాని అంశం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనిదని తెలిపిందని జీవీఎల్ చెప్పారు. రాష్ట్ర రాజధాని విషయంలో కేంద్ర ప్రభుత్వం పాత్ర ఉండదని స్పష్టంగా చెప్పడం జరిగిందని అన్నారు. మూడు రాజధానుల అంశంతో కేంద్ర ప్రభుత్వం వద్దకు రాష్ట్ర ప్రభుత్వం వస్తే... దాన్ని వ్యతిరేకించే అవకాశం లేదని చెప్పారు.
రాజధానిగా అమరావతిని గతంలో అన్ని పార్టీలు ఒప్పుకున్నాయని... అందువల్ల, అమరావతి కొనసాగాలని తాము కూడా కోరుకుంటున్నామని అన్నారు. అమరావతి కోసం రైతులు 33 వేల ఎకరాల భూమిని ఇచ్చారని... వారికి న్యాయం జరగాలని చెప్పారు. అమరావతితో టీడీపీ స్వార్థ ప్రయోజనాలు ముడిపడి ఉన్నాయనే విషయం రాష్ట్ర ప్రజలందరికీ తెలుసని అన్నారు. కేవలం శాసన రాజధానిగా అమరావతి ఉంటే అభివృద్ధి చెందదని... అందువల్ల అమరావతిని పూర్తిగా డెవలప్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని తాము కూడా డిమాండ్ చేస్తామని చెప్పారు.