Khushbu: పార్టీతో విభేదిస్తే బీజేపీలో చేరుతున్నట్టా?: ఖుష్బూ
- నూతన విద్యావిధానాన్ని స్వాగతించిన ఖుష్బూ
- విరుచుకుపడిన కాంగ్రెస్ శ్రేణులు
- స్పందించే హక్కు తనకుందున్న ఖుష్బూ
కేంద్రం ఇటీవల ప్రకటించిన నూతన విద్యావిధానాన్ని సినీ నటి, తమిళనాడు కాంగ్రెస్ నేత ఖుష్బూ స్వాగతించడం తెలిసిందే. దాంతో ఖుష్బూపై విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆమె వ్యాఖ్యానిస్తూ, 'క్షమించాలి, నేనేమీ రోబోను కాను రాహుల్ జీ' అంటూ స్పందించారు. ఈ వ్యాఖ్యల అనంతరం ఆమెపై ట్రోలింగ్ మరింత పెరిగింది. ఖుష్బూ బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారంటూ ప్రచారం మొదలైంది. దీనిపై ఖుష్బూ వివరణ ఇచ్చారు. విమర్శలు చేసేవాళ్లందరూ శాంతించాలని సూచించారు.
తానేమీ బీజేపీలో చేరడం లేదని, పార్టీతో విభేదించినంత మాత్రాన బీజేపీలో చేరుతున్నట్టా? అని ప్రశ్నించారు. ఏదైనా అంశంపై సొంత అభిప్రాయం వెల్లడించే హక్కు తనకుందని స్పష్టం చేశారు. కేంద్రం తీసుకువచ్చిన నూతన విద్యావిధానంలో తాను పాజిటివ్ అంశాలనే చూశానని, మార్పును సానుకూల దృక్పథంతో స్వీకరించాలన్నది తన భావన అని ఖుష్బూ స్పష్టం చేశారు. విపక్షం కూడా దేశ ప్రజల భవిష్యత్తు కోసమే పాటుపడాలని అభిప్రాయపడ్డారు.
అయితే, తమిళనాడు కాంగ్రెస్ మాత్రం ఖుష్బూపై అసంతృప్తితో ఉన్నట్టు అర్థమవుతోంది. రాష్ట్ర కాంగ్రెస్ రైతు విభాగం ప్రధాన కార్యదర్శి మురళీధరన్ ఈ అంశంపై మాట్లాడుతూ, గత ఆర్నెల్లుగా ఖుష్బూ చర్యలు కాంగ్రెస్ కు వ్యతిరేకంగానే ఉన్నాయని, దీన్ని బట్టి ఆమె ఇతర మార్గాలు చూసుకుంటున్నట్టు తెలుస్తోందని అన్నారు.