Cyber Crime: సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే అమ్మాయిలే ఇతడి టార్గెట్... అదుపులోకి తీసుకున్న సైబర్ పోలీసులు!
- వాట్సాప్ లో అసభ్య చిత్రాలు పంపుతూ వేధింపులు
- నగ్న చిత్రాలు పంపాలంటూ బెదిరింపులు
- దుర్గాప్రసాద్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
వాట్సాప్ లో అసభ్యకర సందేశాలతో వివాహితలు, అమ్మాయిలను వేధిస్తున్న దుర్గాప్రసాద్ అనే వ్యక్తిని సైబర్ క్రైమ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే అమ్మాయిలు, వివాహితలను టార్గెట్ గా చేసుకుని, వారి ఫోన్ నెంబర్లు సంపాదించి, ఆపై వారి నగ్నచిత్రాలు పంపాలని, లేకపోతే వారి ఫోన్ నెంబర్ ను అశ్లీల వెబ్ సైట్లలో పోస్టు చేస్తానంటూ దుర్గాప్రసాద్ బెదిరింపులకు పాల్పడుతున్నట్టు గుర్తించారు.
నగ్న చిత్రాల కోసం వీడియో కాల్ చేస్తూ బ్లాక్ మెయిల్ కు దిగుతుండడంతో విసిగిపోయిన ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దాంతో రంగంలోకి దిగిన సైబర్ క్రైమ్ పోలీసులు దుర్గాప్రసాద్ ను అరెస్ట్ చేశారు. కాగా, దుర్గాప్రసాద్ గతంలోనూ ఇలాంటి నీచానికి పాల్పడి జైలుకు వెళ్లొచ్చాడు. జైలు నుంచి వచ్చినా అతడిలో ఎలాంటి మార్పులేదని తాజా ఘటనతో నిరూపితమైంది. దుర్గాప్రసాద్ మొబైల్ ఫోన్ ను స్వాధీనం చేసుకున్న పోలీసులు ఆశ్చర్యపోయారు. అతడి కాంటాక్టు లిస్టులో లేడీ డాక్టర్లు, లాయర్లు, యువతుల ఫోన్ నెంబర్లు ఉన్నట్టు గుర్తించారు. రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేశారు.