Yanamala: శ్రావణ శుక్రవారం రోజున ఆడపడుచులతో కన్నీళ్లు పెట్టించారు: యనమల

yanamala criticizes jagan decisions

  • 3 రాజధానుల నిర్ణయంపై టీడీపీ నేతల స్పందన
  • సీఆర్‌డీఏను రద్దు చేయడం అభివృద్ధి చర్యా?
  • సామాజిక బాధ్యతలేని సీఎంగా చరిత్రలో జగన్ మిగిలిపోతారు
  • ప్రజల తరఫున కోర్టుల్లో పోరాడతాం

వైసీపీ ప్రభుత్వం ప్రతిపాదించిన రాజధాని వికేంద్రీకరణ బిల్లుకు ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. రాజధానుల విషయంలో సీఎం జగన్‌ తీసుకున్న నిర్ణయాలపై టీడీపీ నేతలు విమర్శలు గుప్పించారు. అవినీతిపరుల పాలనలో మూడు ప్రాంతాల అభివృద్ధి ఎలా సాధ్యం? అని  యనమల రామకృష్ణుడు ప్రశ్నించారు. స్థానికుల ఆస్తులన్నీ దోచి భూకబ్జాదారులకు కట్టబెట్టడమే వైసీపీ పని అని ఆయన విమర్శించారు.
 
సీఆర్‌డీఏను రద్దు చేయడం అభివృద్ధి చర్యా? అని యనమల నిలదీశారు. సామాజిక బాధ్యతలేని సీఎంగా చరిత్రలో జగన్ మిగిలిపోతారని ఆయన అన్నారు. శ్రావణ శుక్రవారం రోజున ఆడపడుచులతో కన్నీళ్లు పెట్టించారని ఆయన విమర్శించారు.

అమరావతి రాజధానికి పూర్తి మద్దతిస్తామని గతంలో జగన్‌ చెప్పారని  అయ్యన్న పాత్రుడు అన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మూడు రాజధానులపై జగన్ ఎందుకు మాట్లాడలేదు? అని ఆయన నిలదీశారు. రాజ్యాంగానికి వ్యతిరేకంగా గవర్నర్ నిర్ణయం తీసుకున్నారని ఆయన అన్నారు. రాజధాని విషయంలో సోము వీర్రాజు రోజుకోమాట మాట్లాడుతున్నారని విమర్శించారు.

ప్రజాభిప్రాయం పట్టించుకోకుండా రాజధాని బిల్లులను గవర్నర్ ఆమోదించడం విచారకరమని కళా వెంకట్రావు అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల తరఫున కోర్టుల్లో పోరాడతామని చెప్పారు. అమరావతిపై దుష్ప్రచారం చేసి ఇప్పటికే ఏడాదిన్నర కాలం వృథా చేశారని ఆయన అన్నారు. రాజధానుల పేరుతో ప్రజలను మభ్య పెడుతున్నారని చెప్పారు.

  • Loading...

More Telugu News