Quarantine: కరోనా నెగెటివ్ ఉంటే భారత్ వచ్చే ప్రయాణికులకు క్వారంటైన్ నుంచి మినహాయింపు
- నూతన మార్గదర్శకాలు విడుదల చేసిన కేంద్రం
- కరోనా నెగెటివ్ వస్తేనే సడలింపులు
- కొత్త మార్గదర్శకాలు ఆగస్టు 8 నుంచి అమలు
విదేశాల నుంచి భారత్ వచ్చే ప్రయాణికులకు కేంద్రం ఓ ముఖ్యమైన మినహాయింపు ఇచ్చింది. భారత్ వచ్చే ప్రయాణికులు ఇకపై క్వారంటైన్ కేంద్రాలకు వెళ్లాల్సిన అవసరం ఉండదు. అయితే వారికి కరోనా నెగెటివ్ అని రిపోర్టు ఉంటేనే ఈ వెసులుబాటు వర్తిస్తుంది. భారత్ రావాలనుకునేవారు తమ ప్రయాణానికి 96 గంటల ముందు కరోనా టెస్టు చేయించుకోవాల్సి ఉంటుంది. అందులో నెగెటివ్ వస్తే వారికి క్వారంటైన్ కేంద్రాల్లో ఉండాల్సిన అవసరం ఉండదు.
ఇక ప్రత్యేక పరిస్థితుల్లో భారత్ వచ్చే ప్రయాణికులకు కూడా ఓ సడలింపు ఇచ్చారు. గర్భం, కుటుంబంలో ఎవరైనా చనిపోయినా, తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నా, లేక 10 ఏళ్ల లోపు చిన్న పిల్లలున్న తల్లిదండ్రులు భారత్ వస్తే వారు 14 రోజుల హోమ్ క్వారంటైన్ ను కోరుకోవచ్చు. ఇంతకుముందు 7 రోజుల పెయిడ్ క్వారంటైన్, 7 రోజుల హోమ్ క్వారంటైన్ నిబంధన ఉండేది. ఈ వెసులుబాటు కోరుకునేవారు తమ ప్రయాణానికి మూడ్రోజుల ముందు కేంద్ర ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నూతన మార్గదర్శకాలు ఆగస్టు 8 నుంచి అమల్లోకి రానున్నాయి.