IPL 2020: పురుషులతో పాటే మహిళల ఐపీఎల్... మూడు జట్లతో మ్యాచ్ లు!
- యూఏఈ వేదికగా ఐపీఎల్
- అనుమతించిన కేంద్రం
- మహిళల మ్యాచ్ ల పట్ల సానుకూలంగా స్పందించిన గంగూలీ
ఐపీఎల్ తాజా సీజన్ కు కేంద్రం పచ్చ జెండా ఊపిన నేపథ్యంలో ఇప్పుడందరి దృష్టి యూఏఈలో త్వరలో ప్రారంభమయ్యే లీగ్ పోటీలపై కేంద్రీకృతమైంది. ఐపీఎల్ ఎప్పుడెప్పుడా అని క్రికెట్ అభిమానులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారంటే అతిశయోక్తి కాదు. కరోనా వంటి విపత్తు నుంచి ప్రజల దృష్టిని మరల్చడం ఐపీఎల్ కే సాధ్యమని ఇప్పటికే పలువురు అభిప్రాయపడ్డారు.
కాగా, పురుషుల ఐపీఎల్ లో మహిళల జట్లతోనూ కొన్ని మ్యాచ్ లు నిర్వహించాలని బీసీసీఐ భావిస్తోంది. బీసీసీఐ చీఫ్ సౌరవ్ గంగూలీ కూడా దీనిపై సానుకూల స్పందన వ్యక్తం చేశారు. యూఏఈ వేదికగా జరిగే ఐపీఎల్ లో మహిళల మ్యాచ్ లకు కూడా అవకాశాలు ఉన్నాయని అన్నారు. అయితే ఎన్నిజట్లతో ఆడించాలన్నదానిపై ఇంకా స్పష్టత రాలేదు. ప్రాథమికంగా మహిళా క్రికెటర్లను మూడు జట్లుగా విభజించి మ్యాచ్ లు ఆడించాలన్నది తమ ఆలోచన అని బోర్డు వర్గాలు తెలిపాయి. ఐపీఎల్ పాలకమండలి సమావేశంలో దీనిపై తుది నిర్ణయం వెలువడనుంది.