Corona Virus: కరోనాపై పోరులో వంటింటి చిట్కాలే భేష్.. పరిశోధనలో వెలుగు చూసింది ఇదే!
- ఆవిరి చికిత్సతో మెరుగైన ఫలితాలు
- తీవ్ర లక్షణాలున్నా వారం రోజుల్లోనే కోలుకుంటున్న వైనం
- ముంబై సెవెన్ హిల్స్ ఆసుపత్రి పరిశోధనలో వెల్లడి
కరోనా వైరస్‌కు అడ్డుకట్ట వేసే టీకా కోసం ప్రపంచవ్యాప్తంగా పరిశోధనలు జరుగుతుండగా, ఇప్పటికే ఆ మహమ్మారి బారినపడుతున్న వారిలో సగానికిపైగా బాధితులు క్షేమంగా కోలుకుంటున్నారు. ఇప్పటి వరకు ఈ వైరస్‌ను ఎదుర్కొనేందుకు ఎలాంటి ఔషధం లేకున్నా వీరంతా ఎలా కోలుకుంటున్నారు? ఈ ప్రశ్నకు సమాధానం వంటింటి చిట్కాలే. అంతేకాదు, వైద్యులు కూడా చాలా వరకు వీటినే పాటించాలని చెబుతుండడం విశేషం. కరోనాపై పోరులో ముందున్నది స్టీమ్ థెరపీయేనని (ఆవిరి చికిత్స) తాజాగా పరిశోధనలో తేలింది.
ముంబైలోని సెవెన్ హిల్స్ ఆసుపత్రి వైద్యులు మూడు నెలల పాటు నిర్వహించిన పరిశోధనలో ఆవిరి చికిత్స కరోనాపై బ్రహ్మాస్త్రంలా పనిచేస్తుందని కనుగొన్నారు. డాక్టర్ దిలీప్ కుమార్ నేతృత్వంలో జరిగిన ఈ పరిశోధనల్లో ఆవిరి పట్టిన కరోనా బాధితుల్లో మెరుగైన ఫలితాలు కనిపించినట్టు తెలిపారు. ఎలాంటి లక్షణాలు లేని (అసింప్టమాటిక్) కరోనా రోగుల్లో బాధితులు రోజుకు మూడుసార్లు ఆవిరి పట్టడం ద్వారా వేగంగా కోలుకున్నట్టు వీరి అధ్యయనంలో తేలింది.
పరిశోధనలో భాగంగా 105 మంది బాధితులను రెండు గ్రూపులుగా విభజించారు. మొదటి గ్రూపులో లక్షణాలు లేని బాధితులకు రోజుకు మూడు సార్లు ఆవిరి చికిత్స చేశారు. ఫలితంగా మూడు రోజుల్లోనే కోలుకున్నారు. లక్షణాలు కొంత తీవ్రంగా ఉన్న వారు మూడు గంటలకు ఒకసారి ఐదు నిమిషాలపాటు ఆవిరి పట్టడం ద్వారా వారం రోజులలోనే కోలుకున్నట్టు వైద్యుల పరిశోధనలో వెల్లడైంది. ఆవిరి చికిత్సలో భాగంగా కొన్ని రకాల క్యాప్సూల్స్, విక్స్, అల్లం, పసుపు వంటి వాటిని స్టీమ్ థెరపీలో ఉపయోగించారు.