Chandrababu: అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు వెళదాం... మీరు గెలిస్తే ఇక మాట్లాడం: చంద్రబాబు
- వైసీపీకి ప్రభుత్వానికి 48 గంటలు సమయం ఇస్తున్నామన్న చంద్రబాబు
- అసెంబ్లీకి రాజీనామా చేయాలని డిమాండ్
- ఇది 5 కోట్ల మందికి చెందిన అంశం అని వెల్లడి
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు మూడు రాజధానులకు వ్యతిరేకంగా సమరశంఖం పూరించారు. గతంలో అమరావతే రాజధాని అని మాట్లాడిన వైసీపీ నేతలకు ఇప్పుడేమైందని ప్రశ్నించారు. రాజధాని అనేది తన ఒక్కడి సమస్య కాదని, 5 కోట్ల మంది ప్రజలకు సంబంధించిన అంశం అని స్పష్టం చేశారు.
"రాష్ట్ర విభజన జరిగినప్పుడు ఎంతో బాధపడ్డాం. కాంగ్రెస్ పార్టీకి నాడు ప్రజలు బుద్ధి చెప్పారు. ఇప్పుడు వైసీపీ అదే రీతిలో ఇష్టానుసారం ప్రవర్తిస్తోంది. ఎన్నికల ముందు మీరేం చెప్పారు, ఎన్నికల తర్వాత మీరేం చేస్తున్నారు. ఎన్నికల ముందు రాజధాని గురించి ఏమీ చెప్పకుండా ప్రజల్ని మభ్యపెట్టి, ఎన్నికల తర్వాత మూడు రాజధానులు చేస్తామంటూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు.
రాష్ట్ర ప్రజల భవిష్యత్తును నాశనం చేసే అధికారం మీకు లేదు. సీఎం జగన్ కు 48 గంటలు సమయం ఇస్తున్నాం... మీ నిర్ణయానికి ప్రజల్లో మద్దతు ఉందని భావిస్తే అసెంబ్లీ రద్దు చేసి ఎన్నికలకు వెళదాం. మీరు గనుక గెలిస్తే ఇక మేం మాట్లాడం. అమరావతి అంశంలో మీరు ఏంచేసినా మేం నోరెత్తం. కానీ ప్రజలకు చెప్పకుండా ఇలా రాజధానిపై నిర్ణయం తీసుకుంటే మాత్రం అది నమ్మించి మోసం చేసినట్టవుతుంది.
మాట మీద నిలబడతాం అని చెప్పుకునే మీరు వీటికి సమాధానం చెప్పండి. 2014 సెప్టెంబరు 4న ప్రతిపక్ష నాయకుడి హోదాలో మీరేం చెప్పారు? "అధ్యక్షా, విజయవాడలో రాజధాని ఏర్పాటు చేయడాన్ని మేం మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం. కారణం ఏంటంటే, మన రాష్ట్రం 13 జిల్లాల చిన్నరాష్ట్రంగా మారింది. ఇంత చిన్న రాష్ట్రంలో ఒక ప్రాంతానికి ఒక ప్రాంతానికి మధ్య చిచ్చుపెట్టడం ఇష్టంలేక, రాజధాని నిర్ణయాన్ని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం. రాజధాని ఎక్కడైనా ఏర్పాటు చేసుకోండి కానీ కనీసం 30 వేల ఎకరాలైనా ఉండేట్టు చూడండి" అని చెప్పింది ఎవరు? మీరు కాదా? ఇప్పుడేమైనా మనది పెద్ద రాష్ట్రంగా మారిపోయిందా? ఇవాళ ఏమొచ్చిందని రాజధానిపై నిర్ణయం తీసుకున్నారు? ఇది ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టడం కాదా?" అంటూ చంద్రబాబు ప్రశ్నించారు.
ఎన్నికల మేనిఫెస్టో కమిటీ చైర్మన్ హోదాలో ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు కూడా అమరావతే రాజధాని అని, దీన్ని మేనిఫెస్టోలో కూడా చేర్చుతామని చాలా స్పష్టంగా చెప్పారని చంద్రబాబు వెల్లడించారు. వైసీపీకే చెందిన మరో నేత వసంత కృష్ణప్రసాద్ కూడా ఇదే తరహాలో మాట్లాడారని, అమరావతే రాజధాని అని, అందుకే మా నాయకుడు ఇక్కడే ఇల్లు కట్టుకున్నాడని, క్యాంపు కార్యాలయం, పార్టీ కార్యాలయం ఇక్కడే నిర్మించారని చెప్పారని వెల్లడించారు. "ఇప్పుడు మినిస్టర్ గా ఉన్న బొత్స అప్పుడేం చెప్పాడో చూడండి! భూకబ్జాలు, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసేవాళ్లే రాజధాని మార్పు కోరుకుంటారు. రాజధాని మార్పు మాకు అవసరం లేదు, రాజధాని అమరావతిలోనే ఉంటుంది" అని బొత్స అప్పుడు చెప్పారు.
"నేనడుగుతున్నా... ఎవరికి కావాలి భూకబ్జాలు? విశాఖలో భూదందాలు చేయాలనుకుంటున్నారా? వైసీపీ మహిళా నేత రోజా ఏమన్నారంటే... రాజధాని కట్టగల సమర్థుడు కాబట్టే అమరావతిలో ఇల్లు నిర్మించుకున్నారంటూ జగన్ గురించి చెప్పారు. ఇప్పుడెందుకు ఆ నిర్ణయాలు మారిపోయాయో చెప్పాలి. మేనిఫెస్టోను బైబిల్, ఖురాన్, భగవద్గీతతో పోల్చిన వైసీపీ నేతలకు తప్పుడు నిర్ణయాలతో రాజధాని మార్చే హక్కులేదు. గట్టిగా ప్రశ్నిస్తే మమ్మల్ని రాజీనామాలు చేయాలంటున్నారు. రాజీనామా చేయడం మాకు ఓ లెక్క కాదు. మీకు దక్షిణాఫ్రికా ఆదర్శమా?" అంటూ చంద్రబాబు నిప్పులు చెరిగారు.