Botsa Satyanarayana: నా సవాల్ కు 48 గంటల్లో చంద్రబాబు సమాధానం చెప్పాలి: బొత్స
- దమ్ముంటే రాజీనామాలు చేసి ఎన్నికలకు వెళ్లాలి
- బాబుకు మతిస్థిమితం సరిగా లేదనే విషయం అర్థమవుతోంది
- ఆయన కుట్రలు, కుతంత్రాలను కొనసాగబోనివ్వం
ఎన్నికల్లో గెలుస్తామనే నమ్మకం ఉంటే.... ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో రాజీనామా చేయించి మళ్లీ ప్రజాక్షేతంలోకి వెళ్లాలని టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ సవాల్ విసిరారు. తాను విసిరిన సవాల్ కు 48 గంటల్లో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు మీడియా సమావేశం చూస్తే ఆయనకు మతి స్థిమితం సరిగా లేదనే విషయం అర్థమవుతోందని ఎద్దేవా చేశారు. గత ఎన్నికల్లో మంగళగిరి, తాడికొండ నియోజకవర్గాల్లో ప్రజలు ఇచ్చిన తీర్పు... అమరావతి డిజైన్ కు చెంపపెట్టు కదా? అని ప్రశ్నించారు.
అధికార వికేంద్రీకరణను వ్యతిరేకించి చంద్రబాబు చరిత్ర హీనుడిగా మిగిలిపోయారని అన్నారు. చంద్రబాబుకు సొంత ప్రాంతమైన రాయలసీమలో న్యాయ రాజధానిని ఏర్పాటు చేస్తుంటే... దాన్ని కూడా వ్యతిరేకిస్తున్నారని విమర్శించారు. సొంత మామకు వెన్నుపోటు పొడిచినట్టుగానే సొంత గడ్డకు కూడా వెన్నుపోటు పొడుస్తున్నారని దుయ్యబట్టారు. చంద్రబాబు కుట్రలు, కుతంత్రాలను కొనసాగనివ్వబోమని అన్నారు.