Rahul Dravid: బీసీసీఐ కరోనా టాస్క్ ఫోర్స్ కు రాహుల్ ద్రావిడ్ నాయకత్వం
- క్రికెట్ కార్యకలాపాలు ప్రారంభించనున్న బీసీసీఐ!
- ఆటగాళ్లలో అవగాహన కల్పించేందుకు టాస్క్ ఫోర్స్
- రాష్ట్రాల క్రికెట్ సంఘాలకు ఎస్ఓపీ పంపిన బీసీసీఐ
కరోనా వ్యాప్తి కారణంగా గత మూడ్నెల్లకు పైగా క్రికెట్ కార్యకలాపాలు నిలిపివేసిన బీసీసీఐ త్వరలోనే దేశంలో మళ్లీ క్రికెట్ పునఃప్రారంభించేందుకు కసరత్తులు చేస్తోంది. ఈ క్రమంలో ప్రత్యేకంగా కొవిడ్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసింది. ఈ కరోనా టాస్క్ ఫోర్స్ నాయకత్వ బాధ్యతలను మాజీ క్రికెటర్ రాహుల్ ద్రావిడ్ కు అప్పగించింది. ద్రావిడ్ ప్రస్తుతం బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ చీఫ్ గా కొనసాగుతున్నారు. దేశవాళీ క్రికెట్ ప్రారంభమైతే అనుసరించాల్సిన స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (ఎస్ఓపీ)ను బీసీసీఐ రాష్ట్రాల క్రికెట్ సంఘాలకు పంపింది.
ఎస్ఓపీని అనుసరించి క్రికెట్ సాధన షురూ చేసే ఆటగాళ్లు బీసీసీఐ కరోనా ప్రోటోకాల్ ను అంగీకరిస్తున్నట్టు ఓ పత్రంపై సంతకం చేయాల్సి ఉంటుంది. ఆటగాళ్ల శిక్షణ శిబిరాల్లో 60 ఏళ్లకు పైబడిన వాళ్లకు ప్రవేశం నిషేధించారు. బీసీసీఐ రూపొందించిన కరోనా ప్రోటోకాల్ సరిగా అమలయ్యేలా చూడడమే ద్రావిడ్ నాయకత్వంలోని కరోనా టాస్క్ ఫోర్స్ ప్రధాన విధి. ఈ టాస్క్ ఫోర్స్ లో ద్రావిడ్ తో పాటు ఓ వైద్య అధికారి, పరిశుభ్రత పర్యవేక్షకుడు, బీసీసీఐ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ (క్రికెట్ ఆపరేషన్స్) ఉంటారు. వీరు నిరంతరం ఆటగాళ్లతో మాట్లాడుతూ, కరోనా వ్యాప్తి పట్ల అప్రమత్తం చేస్తూ ఉండాలి.