Corona Virus: విద్యార్థులపై తీవ్ర ప్రభావం చూపిస్తోన్న కరోనా: వివరాలు తెలిపిన ఐక్యరాజ్యసమితి
- 160 కోట్ల మంది విద్యార్థుల చదువులపై కరోనా ప్రభావం
- 2.5 కోట్ల మంది చిన్నారులు డ్రాపౌట్అయ్యే ఛాన్స్
- 160 దేశాల్లో తాత్కాలికంగా పాఠశాలల బంద్
- వంద కోట్ల మంది విద్యార్థులు చదువులకు దూరం
ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా మహమ్మారి వల్ల సామాజిక, ఆర్థిక, వాణిజ్య, సేవా వంటి అన్ని రంగాలూ కుదేలవుతోన్న విషయం తెలిసిందే. ఈ వైరస్ విద్యావ్యవస్థపై కూడా తీవ్ర ప్రభావం చూపుతోందని ఐక్యరాజ్యసమితి వెల్లడించింది.
'ఎడ్యుకేషన్ అండ్ కొవిడ్-19' అంశంపై ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరెస్ వర్చువల్ పద్ధతిలో మాట్లాడారు. ప్రపంచ వ్యాప్తంగా సుమారు 160 కోట్ల మంది విద్యార్థుల చదువులపై కరోనా ప్రభావం పడిందని చెప్పారు.
వారంతా ప్రస్తుతం చదువును కొనసాగించలేకపోతున్నారని చెప్పారు. అంతేగాక, ప్రపంచ వ్యాప్తంగా 2.5 కోట్ల మంది విద్యార్థులు పాఠశాలల నుంచి డ్రాపౌట్ అయ్యే అవకాశాలు ఉన్నట్లు ఆయన చెప్పారు. గత నెల ప్రపంచంలోని 160 దేశాల్లో పాఠశాలలను బంద్ చేసినట్లు ఆయన వివరించారు.
ఈ కారణంగా దీంతో వంద కోట్ల మంది విద్యార్థులు చదువులకు దూరంగా ఉంటున్నారని చెప్పారు. అలాగే, నాలుగు కోట్ల మంది చిన్నారులు ప్రీస్కూల్ విద్యా సంవత్సరాన్ని కోల్పోయినట్లు ఆయన వివరించారు.