Somireddy Chandra Mohan Reddy: ప్రభుత్వం తీసుకునే తొందరపాటు నిర్ణయాలను రాజ్ భవన్ ఆషామాషీగా తీసుకోకూడదు: సోమిరెడ్డి
- వికేంద్రీకరణ, సీఆర్డీయే రద్దు చట్టం అమలుపై హైకోర్టు స్టే
- హైకోర్టు నిర్ణయాన్ని స్వాగతిస్తున్నానని సోమిరెడ్డి వెల్లడి
- అన్ని కోణాల్లో ఆలోచించి ఉత్తర్వులివ్వాలని గవర్నర్ కు సూచన
మూడు రాజధానులు, సీఆర్డీయే రద్దు చట్టాల అమలుపై హైకోర్టు స్టే ఇవ్వడాన్ని స్వాగతిస్తున్నానంటూ టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ఆయన ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ తీరుపై వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ నిర్ణయాలు న్యాయపరంగా, రాజ్యాంగబద్ధంగా ఉన్నాయో, లేదో తెలుసుకోవాల్సిన బాధ్యత గవర్నర్ పై ఉందని స్పష్టం చేశారు.
ఉదాహరణకు... హైకోర్టు అమరావతిలో అని నిర్ణయించినప్పుడే సుప్రీంకోర్టుతో పాటు భారత రాష్ట్రపతి కూడా ఆమోదించారని వివరించారు. "రాష్ట్ర ప్రభుత్వాలు హైకోర్టులను మార్చలేవని చట్టాలు చెబుతున్నాయి. మీరేమో హైకోర్టు తరలింపుతో కూడిన మూడు రాజధానుల బిల్లుపై సంతకం పెట్టేశారు. ఈ ప్రభుత్వం తీసుకునే తొందరపాటు నిర్ణయాలను రాజ్ భవన్ ఆషామాషీగా తీసుకోకుండా, అన్ని కోణాల్లో ఆలోచించి ఉత్తర్వులు ఇస్తే బాగుంటుంది" అంటూ సోమిరెడ్డి ట్విట్టర్ లో స్పందించారు.