Mumbai: ముంబయిని ముంచెత్తిన భారీ వర్షాలు... రికార్డుస్థాయిలో వర్షపాతం
- 2005 తర్వాత ఇదే పెద్ద వర్షం అన్న ఆదిత్య థాకరే
- ఈ వానకు ఏ నగరమైనా మునిగిపోతుందని వ్యాఖ్యలు
- ఇవాళ, రేపు ముంబయికి అత్యంత భారీ వర్ష సూచన
దేశ ఆర్థిక రాజధాని ముంబయి భారీ వర్షాలతో అతలాకుతలమవుతోంది. గత రాత్రి మొత్తం ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షంతో నగరం నీటమునిగింది! దీనిపై మహారాష్ట్ర మంత్రి ఆదిత్య థాకరే మాట్లాడుతూ, 2005 తర్వాత ఇదే అత్యంత భారీ వర్షం అని తెలిపారు. కుండపోత పోసినట్టుగా కేవలం 4 గంటల్లో 198 మిమీ వర్షపాతం నమోదైందని, ఇలాంటి వర్షంతో ప్రపంచంలో ఏ నగరం అయినా మునిగిపోతుందని అన్నారు.
గత రాత్రి 7 గంటలకు ప్రారంభమైన వర్షం ఈ ఉదయం 6 గంటలకు నిలిచింది. ఈ వ్యవధిలో మొత్తం 230 మిమీ వర్షపాతం రికార్డయింది. కాగా, భారీ వర్షాలతో ముంబయి లోకల్ ట్రైన్ వ్యవస్థ నిలిచిపోయింది. అత్యవసర సర్వీసులు మినహా అన్ని కార్యాలయాలు తెరుచుకోలేదు. ముంబయితో పాటు పరిసర జిల్లాల్లోనూ ఇవాళ, రేపు అత్యంత భారీ వర్షాలు పడతాయని వాతావరణ విభాగం హెచ్చరికల నేపథ్యంలో ప్రజల్లో మరింత ఆందోళన ఏర్పడింది.